CM YS Jagan Birthday Special: 175 నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు

CM YS Jagan Birthday Special Sajjala Ramakrishna Launches Website - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన రక్తదానంకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ (www.ysrcpblooddonation.com)ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19న క్రీడా పోటీలు, మహిళలకు సంబంధించిన పోటీలు, 20న మొక్కలు నాటడం, 21న రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. అదే రోజు కేక్ కటింగ్, సర్వమత ప్రార్థనలు,సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

సుస్ధిరమైన అభివృధ్ది సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని మూడున్నరేళ్ల కాలంలోనే తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిన ఘనత సీఎం జగన్‌ది అని సజ్జల అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడున్నరేళ్ళలోనే 99 శాతం పూర్తి చేశారన్నారు. ఇచ్చిన హామీలకంటే వంద రెట్లు ఎక్కువగా పథకాలు అమలు చేశారన్నారు.

రాష్ట్రంలో అట్టడుగున ఉన్న బలహీనవర్గాలు ఆర్థికంగా బలపడేలా చేయడంతోపాటు వారికి విద్య, వైద్యపరంగాను, ఉపాధి మెరుగైన సేవలు అందించారన్నారు. వీటన్నింటికి మించి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేసి చూపించారన్నారు. వైఎస్‌ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని భావించామన్నారు. ప్రతిసారి పార్టీ తరఫున చేస్తుంటాం. ఈసారి కోట్లాది మంది అభిమానులతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదాదారులు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళాపక్షపాత ప్రభుత్వం, వారికి పెద్దపీట వేశారన్నారు.

అప్పుడు 38వేల యూనిట్లు..
2020లో రికార్డుస్ధాయిలో 38 వేల యూనిట్లు రక్తదానం చేసినట్లు సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు అందరూ శిబిరాలకు వచ్చి రక్తదానం చేశారు. తమ నాయకుడైన సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మరోవైపు తమ భాధ్యతగా అవసరమైనవారికి రక్తం ఇవ్వాలనే మహోన్నత ఆశయంతో ఆనాడు రక్తదానం చేశారన్నారు. అప్పుడు కూడా రెడ్ క్రాస్, వైఎస్సార్‌సీపీ  కలిసి రక్తదాన కార్యక్రమం నిర్వహించాయన్నారు.

ఆ రోజున బ్లడ్ ఎక్కువ కాలం స్టోర్ చేశారు. నిజంగా అవసరమైనప్పుడు ఇస్తే బాగుంటుందనే భావించామన్నారు. అందుకే ఈసారి ఫిజికల్‌గా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వెబ్ సైట్ కూడా లాంచ్ చేశాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాలలోను ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వారికి అది అందేలా చేయడం ఈ వెబ్ సైట్(www.ysrcpblooddonation.com) వల్ల వీలు కలుగుతుంది. కార్యకర్తలు, అభిమానులు తమ నాయకుడికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడంతోపాటు సామాజిక బాధ్యత నెరవేర్చినట్లు అవుతుందన్నారు. వివిధ కాలేజీలు, సంస్ధలు అందరూ కూడా ప్రమోట్ చేయాలని కోరుతున్నామన్నారు. తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు రక్తం ఎంతో అవసరం అన్నారు.

రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్నిపురస్కరించుకుని విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రెడ్ క్రాస్ మన రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందన్నారు. 2020లో కూడా రెడ్ క్రాస్ ద్వారా రక్తదానశిబిరాల ద్వారా 38 వేల యూనిట్లు రక్తాన్ని సేకరించామన్నారు. ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేయడమే కాకుండా ప్లెడ్జ్ ఫామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఆన్ లైన్ లో కూడా ఇవ్వచ్చు లేదా రక్తదానశిబిరాల వద్దకు వచ్చి ఈ ఫామ్స్ ఇవ్వచ్చని తెలియచేశారు. అత్యవసర పరిస్దితులలో రక్తం అవసరమైనప్పుడు మేము సేకరించే డేటా ద్వారా రక్తదాతల ద్వారా అవసరమైనవారికి సహాయం అందిస్తామన్నారు. 175 నియోజకవర్గాల వారీగా సేకరిస్తున్నామని తద్వారా ఆయా ప్రాంతాలలో రక్తదాతలు అందుబాటులో ఉంటారన్నారు.

కార్యక్రమంలో సాంఘికసంక్షేమశాఖమంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ళఅప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్‌రెడ్డి, నారమల్లి పద్మజ, పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు సజ్జల భార్గవ్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
చదవండి: మద్యం బ్రాండ్‌లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్‌ కింగ్‌ చంద్రబాబే..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top