Jagananna Vidya Kanuka: పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్‌

CM Jagan Speech Distribution of Jagananna Vidya Kanuka Kits Adoni - Sakshi

సాక్షి, నంద్యాల జిల్లా: కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయంచేస్తోంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..

'దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్‌ మీడియం చదువుకోవాలి. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద​ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్‌ యాప్‌నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. 

విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యాకానుక
పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్‌ విలువ రూ.2వేలు. విద్యార్థుల ఖర్చు గురించి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 8వ తరగతిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ట్యాబ్‌. రూ.12వేల విలువైన ట్యాబ్‌ విద్యార్థులకు ఇస్తున్నాం. 2020-21లో విద్యాకానుకకు రూ.648 కోట్లు ఖర్చు చేశాం. 42.34 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2021-22లో విద్యాకానుకకు రూ.789 కోట్లు ఖర్చు చేశాం. 45.71లక్షల మందికి లబ్ధి చేకూరింది. మూడో ఏడాదిలో విద్యాకానుకకు రూ.931 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 47.40 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.

ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే..
విద్యాకానుకలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌, 3 జతల యూనిఫామ్‌ క్లాత్‌, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్‌, స్కూల్‌ బ్యాగ్‌, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే.. బడిమానేసే పిల్లలు తగ్గాలి. పిల్లల్ని బడికిపంపేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. అప్పుడు ప్రతి ఇంట్లో ఆనందం చూడగలుగుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి. ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 7లక్షల మందికి పైగా చేరారు. విద్యారంగంలో 9 ప్రధాన పథకాలను అమలు చేస్తున్నాం అని సీఎం జగన్‌ అన్నారు.

ఆదోనికి వరాల జల్లు
స్థానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడిగిన మేరకు ఆదోనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్‌, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికనుంచే ప్రకటించారు. 

అకడమిక్‌ కేలండర్‌ ఆవిష్కరణ
కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top