ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు: సీఎం జగన్‌

CM Jagan Review Meeting On RBKs Link With Civil Supplies Department - Sakshi

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు.

అదే విధంగా సాయిల్‌కార్డులతోపాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై సలహాలు అందించాలన్నారు. ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని పేర్కొన్నారు. రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందేనన్న ముఖ్యమంత్రి..  ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు.

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతంగా సమన్వయం: 

  • రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి
  • విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా, పిషరీస్, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాయి
  • ఈ కార్యకలాపాలు సమర్థవంతంగా ముందుకు సాగాలంటే.. సంబంధిత శాఖలతో (లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌) చక్కటి సమన్వయం అవసరం
  • వ్యవసాయం, ఫిషరీస్, రెవిన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర శాఖలతో సమన్వయం సమర్థవంతంగా ఉండాలి
  • నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి వివిధ శాఖలతో కలిసి అనుసంధానమై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది
  • ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగేందుకు వీలుగా సమర్థవంతమైన మార్గదర్శక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి
  •  దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశం.

క్రమం తప్పకుండా భూసార పరీక్షలు:

  • అవసరం లేకపోయినా, విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి
  • దీనిపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది
  •  ప్రతిరైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలి
  • రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలి
  • దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గుతుంది
  • ఒక మనిషికి డాక్టర్‌ ఎలా ఉపయోగపడతాడో, పంటలసాగులో రైతులకు ఆర్బీకేలు అదే విధంగా ఉపయోగపడాలి
  • ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్‌టెస్టులు చేసేవిధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం
  • వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తరహాలో.. ఒక కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు ఈ విషయంలో సలహాలు సూచనలు గ్రామాల్లో అందాలన్న సీఎం

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం:

  • ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి
  • కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు
  • రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందే
  • ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు
  • ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్, క్వాంటిటీ టెస్టింగ్‌ జరగాలన్న సీఎం.
  • ధాన్యం కొనుగోలు ప్రక్రియమీద, ఎంఎస్‌పీ మీద,  అనుసరించాల్సిన నియమాలమీద రైతుల్లో అవగాహన కల్పించాలన్న సీఎం. 
  • దీనికి సంబంధించి కరపత్రాలను, పోస్టర్లను, హోర్డింగ్‌లను పెట్టాలన్న సీఎం. 
  • ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • ఆర్బీకేల స్థాయిలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం. 
  • ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలన్న సీఎం.
  • వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలన్న సీఎం.

చదవండి: ఒక్క క్లిక్‌తో సమాచారమంతా..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top