కోవిడ్‌ పట్ల అప్రమత్తం

CM Jagan in a review on the facilities available for corona vaccination - Sakshi

వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఉన్న సదుపాయాలపై సమీక్షలో సీఎం జగన్‌ 

సెకండ్‌వేవ్‌ వస్తోందని సమాచారం..  

బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారు  

ఈ పరిణామాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలి 

సూపర్‌ స్పెషాలిటీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

వ్యాక్సిన్లు, అవి పని చేస్తున్న తీరుపై, బ్రిటన్‌ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఈ దిశగా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన కల్పించాలి. టీకా విషయమై శిక్షణ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వ చేసే విషయం, ఇందుకు అవసరమయ్యే మౌలిక వసతుల గురించి ఆలోచించాలి.  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని కోరారు. బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలపై దృష్టి పెట్లాలని ఆదేశించారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై చర్చించారు. సెకండ్‌ వేవ్‌ వచ్చినా, తగిన చికిత్స అందించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

సగటున రోజుకు 65 వేల టెస్టులు చేస్తున్నామని.. టీచర్లకు, పిల్లలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాల గురించి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల గురించి వివరించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం ఉందని, తగిన సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు. ఇందుకోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, వివిధ శాఖల ఉన్నతాధికారులు 
పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top