సత్వర సేవలు.. | Sakshi
Sakshi News home page

సత్వర సేవలు..

Published Tue, May 10 2022 4:14 AM

CM Jagan review on Department of Municipal and Urban Development - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఏమాత్రం తావులేదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. అధికారులు ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

పట్టణ పేదలకు 1.39 లక్షల యూనిట్ల టిడ్కో ఇళ్లను అన్ని మౌలిక సదుపాయాలతో జూన్‌ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. గత సర్కారు నీరు, రోడ్లు లాంటి కనీస సదుపాయాలను కూడా కల్పించకపోగా అరకొరగా పనులు చేపట్టి సగం ఇళ్లను కూడా పూర్తి చేయలేదని చెప్పారు. మౌలిక వసతులు శూన్యమని, కరెంట్‌ కూడా లేదన్నారు. అలాంటి దశలో ఉన్న ఇళ్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో నిర్మిస్తోందని తెలిపారు. టిడ్కో ఇళ్లకు మూడేళ్లలో రూ.5,500 కోట్లు వ్యయం చేశామని, అవసరాన్ని బట్టి ఇంకా ఖర్చు చేస్తామని చెప్పారు.

దాదాపు రూ.14 వేల కోట్ల వ్యయంతో విశాఖలో తలపెట్టిన 76.9 కి.మీ మెట్రో రైలు ప్రాజెక్టుపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాలతో విజయవంతంగా నడుస్తున్న మహిళా మార్ట్‌లను మరిన్ని అందుబాటులోకి తేవడంపై పరిశీలన చేయాలని సూచించారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ ద్వారా మధ్య తరగతి ప్రజల కోసం ఉద్దేశించిన ఎంఐజీ లే అవుట్లను ప్రతి నియోజకవర్గంలో అన్ని వసతులతో ఆదర్శంగా రూపొందించాలన్నారు. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అన్ని పట్టణాల్లో గుంతలు లేని రహదారులు ఉండాలని నాడు – నేడు ద్వారా వాటిని తీర్చిదిద్ది వ్యత్యాసాన్ని ఫొటోల ద్వారా ప్రజలకు తెలియచేయాలన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఉత్తమ జీవన ప్రమాణాలతో టిడ్కో ఇళ్లు 
గత పాలకులు పట్టణ ప్రాంత ప్రజల కోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేశారని, కనీస మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, మురుగు శుద్ధి లాంటి సదుపాయాలు లేకుండా అస్తవ్యస్థంగా చేశారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీటి కోసం ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవి లేకపోతే ఆయా ప్రాంతాలు మురికివాడలుగా మారే అవకాశం ఉందన్నారు. పట్టణ పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే దిశగా టిడ్కో ఇళ్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. జూన్‌ నాటికి 1.39 లక్షల యూనిట్లు పూర్తి చేసేలా రూ.1,685 కోట్లు సమకూరుస్తామన్నారు.

వడివడిగా విశాఖ మెట్రో 
విశాఖపట్నంలో సమారు 76.9 కిలోమీటర్ల మేర తలపెట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దీనిపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం జగన్‌ సంబంధిత అధికారులను అదేశించారు. దాదాపు రూ.14 వేల కోట్లతో నాలుగు కారిడార్లలో నిర్మించే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని, కోచ్‌ల డిజైన్‌తో పాటు మెట్రో స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు, వసతులతో నివేదిక సమగ్రంగా సమర్పించాలన్నారు. ఈ ప్రాజెక్టులో పర్యావరణ హిత విధానాలకు పెద్దపీట వేయాలని  సూచించారు. ప్రాజెక్టుకు అవసరమైన వనరుల సమీకరణపైనా అధికారులతో చర్చించారు. 

ప్రజలు కోరుకునేలా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ 
పట్టణ ప్రాంత ప్రజలకు అనువుగా ఉండేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక  ఎంఐజీ లే అవుట్‌ను మోడల్‌ మాదిరిగా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. క్లియర్‌ టైటిల్‌ డీడ్‌తో పాటు న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించాలని, ప్రజలు కోరుకునే రీతిలో తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ఈ లే అవుట్లు ఆదర్శంగా ఉండాలన్నారు.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ (ఎంఐజీ లేఅవుట్స్‌) కోసం ఇప్పటిదాకా 82 అర్బన్‌ నియోజకవర్గాల్లో 6,791 ఎకరాలను గుర్తించామని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్లు పనులు పూర్తయ్యాయని, మరో 864.29 ఎకరాల్లో ఈ నెల చివరినాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. 

తాగునీరు, పారిశుధ్యంపై ట్రాకింగ్‌ సిస్టమ్‌
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం ద్వారా పారిశుధ్యం మెరుగుపడేలా అధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. చెత్త వేసేందుకు అందచేసిన డస్ట్‌బిన్లలో ఏ రంగు డబ్బాలో ఎలాంటి చెత్త వేయాలో సూచిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంచాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యానికి సంబంధించి ఎస్‌వోపీలు రూపొందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ట్రాకింగ్‌ సిస్టమ్‌ తేవాలని సూచించారు.

చెత్త తొలగింపు ఎప్పటికప్పుడు జరుగుతోందా? లేదా?.. తాగునీటి సరఫరా సజావుగా జరుగుతోందా? అనే అంశాలను పరిశీలించాలన్నారు. తద్వారా ఏవైనా ఇబ్బందులుంటే గుర్తించి వెంటనే పరిష్కరించే వీలుంటుందన్నారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేయగా మరో 8 లక్షల డబ్బాల పంపిణీని ఈనెల 22 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో 2,426 ఆటోలు సేవలు అందిస్తుండగా మరో 400 ఆటోలు ఈ నెలాఖరు నాటికి, 1,123 ఈ–ఆటోలు జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. డిసెంబర్‌ నాటికి గార్బేజ్‌ ట్రాన్స్పర్‌ స్ట్రేషన్లు (జీటీఎస్‌) పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

మరిన్ని మహిళా మార్ట్‌లపై పరిశీలన
పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాలతో విజయవంతంగా నడుస్తున్న మహిళా మార్ట్‌లను మరిన్ని తేవడంపై అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ అదేశించారు. మార్ట్‌ల కోసం అనువైన ప్రాంతాల్లో భవనాలను గుర్తించి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని సూచించారు. 

కృష్ణా కరకట్ట విస్తరణ పనులు వేగవంతం
విజయవాడలో కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని, ఇప్పటికే విద్యుత్‌ స్తంభాలను తొలగించామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపైనా దృష్టిపెట్టామన్నారు. రాయపూడి వద్ద నిర్మిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, కార్యదర్శి వి.రామ మనోహరరావు, కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

జూన్‌కి రోడ్ల మరమ్మతులు పూర్తి
కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో రహదారులపై అధికారులు దృష్టి పెట్టాలని, అన్ని చోట్లా గుంతలు లేని రోడ్లు కనిపించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. నాడు–నేడు ద్వారా  బాగు చేసిన రోడ్ల పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలన్నారు. జూన్‌ నాటికి రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement