చిన్నారులకు అత్యుత్తమ వైద్యం

CM Jagan Mandate about to provide best medical care to Childrens - Sakshi

నెలలోగా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి: ముఖ్యమంత్రి జగన్‌ 

జనావాసాలకు దగ్గరగా హెల్త్‌ హబ్స్‌

నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు 

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు 

ప్రతి జిల్లాకూ కోవిడ్‌ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందికీ ఆర్థిక సాయంపై పరిశీలన

రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు 

ఆరోగ్యశ్రీ దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా నిలవాలి. ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్ధారిస్తున్న రేట్లు ఇబ్బందులకు గురిచేసేలా కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఫిక్స్‌ చేయాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు మూడు వారాల లోపే బిల్లులు చెల్లిస్తున్నాం. పథకం అమలులో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం. సకాలంలో బిల్లుల చెల్లింపు ఆరోగ్యశ్రీ విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతి రోజూ ఆరోగ్యశ్రీ పథకంపై దృష్టి పెట్టాలి. అప్పుడే పేదల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. థర్డ్‌ వేవ్‌ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్‌ తగ్గిన తరువాత ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యల బారిన పడుతున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లోగా హెల్త్‌ హబ్‌లపై విధివిధానాలను ఖరారు చేయాలని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కుటుంబాలకు త్వరగా ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కోవిడ్‌ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్ధిక సహాయం అందించడంపై పరిశీలన చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్‌...
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్‌ సంబంధిత అంశాల్లో నర్సులు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయాల గురించి అధికారులు వివరించారు. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తం 1,600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అదనంగా చిన్న పిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

టైర్‌–1 నగరాల తరహాలో అత్యుత్తమ వైద్యం 
హెల్త్‌ హబ్‌లపై సమీక్ష సందర్భంగా జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్స విధానాలు, టెక్నాలజీ, అత్యుత్తమ సదుపాయాలను ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకు రావాలన్నదే హెల్త్‌ హబ్‌ల వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలన్నారు. 

ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), కోవిడ్‌ అండ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ.కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ మల్లికార్జున్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

వారంలో గణనీయంగా తగ్గిన కోవిడ్‌ కేసులు (జూన్‌ 6–12 వరకు)
► జూన్‌ 12న 6.58 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు. మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం  8 అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5% లోపే.
► 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0–9% లోపే. 
► చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 10–19 శాతం మధ్య పాజిటివిటీ రేటు
► 85,637కి తగ్గిన యాక్టివ్‌ కేసులు. 94.61 శాతానికి పెరిగిన రికవరీ రేటు. 
► 104 కాల్‌ సెంటర్‌కు ఏప్రిల్‌ 15 నుంచి 5 లక్షలకుపైగా కాల్స్‌ అందగా ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ సంఖ్య 6,41,093. ప్రస్తుతం రోజు వారీ కాల్స్‌ సుమారు 2,700. 
► జూన్‌ 12 వరకూ 2,303 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు, 157 మంది మృతి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top