మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ: సీఎం జగన్‌

CM Jagan Launches YSR Cheyutha Second Phase Money To Beneficiary Accounts - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని తెలిపారు.

కుటుంబానికి మహిళలే రథసారధులు
నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు సీఎం జగన్‌ అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. అమూల్‌, రిలయన్స్‌, పీ అండ్‌ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, 78వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని సీఎం జగన్‌ తెలిపారు. లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని, లీటర్‌ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

కేబినెట్‌లోనూ మహిళలకు ప్రాధాన్యత
కేబినెట్‌లోనూ మహిళలకు ప్రాధాన్యతఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు నామినేటెడ్‌ పదవులను కేటాయించామని సీఎం జగన్‌ అన్నారు. ప్రతి రంగంలో అధిక శాతం మహిళలకు ప్రాతినిథ్యం కల్పించామని, వారి కోసం దిశ, అభయం యాప్‌ తీసుకొచ్చామని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని, వారికోసం ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ చెప్పారు.

45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 

మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అయింది. ఇప్పటికే 78వేల మందికి ఏపీ ప్రభుత్వం కిరాణా షాపులు పెట్టించింది. కిరాణా షాపుల ద్వారా ఒక్కో మహిళకు రూ.10వేల వరకు అదనపు ఆదాయం రానుంది. 1,90,517 మందికి ప్రభుత్వం గేదెలు, ఆవులు, మేకలు అందించింది. లీటర్‌ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు లబ్ధి చేకూరుతోంది.

ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు.

ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్‌ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top