పేదలకు పెద్ద వైద్యం

CM Jagan laid foundation stone for 14 medical colleges for first time in histor - Sakshi

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16 మెడికల్‌ కాలేజీలు.. ఇప్పటికే 2 ప్రారంభం.. మిగతా 14కు సీఎం శంకుస్థాపన

ఇది మనిషి ప్రాణం విలువ బాగా తెలిసిన ప్రభుత్వం.. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యమే లక్ష్యం

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ హాస్పిటల్‌

అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు నర్సింగ్‌ కళాశాల

16 హెల్త్‌ హబ్‌లతో కనీసం 80 సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు

రాష్ట్రంలో సమూలంగా మారనున్న వైద్య ఆరోగ్య రంగం రూపురేఖలు

కోవిడ్‌తో మరణించిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రూ.5 లక్షల సాయం

కేంద్ర పరిహారం వర్తించని వారికి ఈ సాయం వర్తింపు

కోవిడ్‌ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అండగా ప్రభుత్వం 

ఎలాంటి లోటు లేదు.. ఉండదు
‘‘కోవిడ్‌కు సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగానూ, పలు సందర్భాలలో వివరంగా చెప్పాం. టీకాలు ఇవ్వడంలో కానీ, ఆక్సిజన్‌ విషయంలో కానీ, కోవిడ్‌ మందుల విషయంలో కానీ ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఎలాంటి లోటు లేదని, ఉండదని మరొక్కసారి మాట ఇస్తున్నా’’
– ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, పేదలు, సామాన్యులకు చెంతనే కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే సారి 14 వైద్య కళాశాలలకు సోమవారం శంకుస్థాపన చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల దాకా సేవలు అనుసంధానమై ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను రూ.8,000 కోట్ల వ్యయంతో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలల పనులు ప్రారంభం కాగా తాజాగా విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు,  ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటయ్యే 14 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీల శిలాఫలకాలను ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్‌ విధానంలో  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

సమీపంలోనే మెరుగైన వైద్యం..
మనందరి ప్రభుత్వం ఏర్పాటై నిన్నటితో (ఆదివారం) రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి  శ్రీకారం చుడుతున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి టీచింగ్‌ ఆస్పత్రికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది కాబట్టి డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. పేదవాడికి మంచి వైద్యం, వీలైనంత  దగ్గర్లోనే అందుబాటులోకి తెచ్చేలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

దశాబ్దాలుగా 11 మాత్రమే..
బ్రిటీష్‌ కాలం నుంచి చూసినా రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ  ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయగలుగుతున్నాం. దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే విశాఖ జిల్లా పాడేరు, కడప జిల్లా పులివెందుల మెడికల్‌ కాలేజీల పనులు మొదలయ్యాయి. మిగిలిన 14 మెడికల కాలేజీల పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ 2023 డిసెంబరు నాటికి పూర్తై అందుబాటులోకి వస్తాయి.

ఈ రోజు వేస్తున్న అడుగుతో..
ఈ కాలేజీల నిర్మాణంతో దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ తీసిపోని విధంగా మన రాష్ట్రం తయారవుతుందని సంతోషంగా చెబుతున్నా. ఎందుకంటే మనకు టైర్‌–1 నగరాలు లేవు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మహా నగరాలు లేవు. మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అలాంటి నగరాల్లోనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుంచి మనకు విముక్తి కావాలంటే, మన దగ్గరే టెరిషరీ వైద్యం అభివృద్ధి చెందాలంటే ఈరోజు వేసే గొప్ప అడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

హెల్త్‌ హబ్స్‌తో ప్రైవేట్‌లోనూ ఆస్పత్రులు..
16 హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు కానుండటం మరో అంశం. సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను మూడేళ్లలో పూర్తి చేసేలా రూ.100 కోట్ల పెట్టుబడితో ఎవరు ముందుకు వచ్చినా జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలోనూ ఐదు ఎకరాల చొప్పున భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ విధంగా ఒక్కోచోట ఐదారు ఆస్పత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే దాదాపు మరో 80 నుంచి 90 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రైవేటు రంగంలో అందుబాటులోకి వస్తాయి.

ఆరోగ్యశ్రీతో అనుసంధానం..
ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానమై ఉంటాయి. ఏ విధంగా అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అనుసంధానం అయ్యాయో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 80 నుంచి 90 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా వస్తాయి. ఇవన్నీ ఏర్పాటు కావడం వల్ల జిల్లాల రూపురేఖలు మారి వైద్య రంగంలో మెరుగైన పరిస్థితి వచ్చి పేదలకు మంచి వైద్యం అందుతుందని మీ బిడ్డగా సంతోషంగా చెబుతున్నా.

అత్యాధునిక వసతులు..
ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 500 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మాడ్యులర్‌ ఆపరేషన్‌ ధియేటర్లు, సెంట్రలైజ్డ్‌ ఏసీతో ఐసీయూలు, ఓపీ రూమ్స్, డాక్టర్‌ రూమ్స్, మెడికల్‌ ఆక్సిజన్‌ పైప్‌లైన్లతో అనుసంధానం చేసిన బెడ్లు, ఆక్సిజన్‌ నిల్వ చేసిన ట్యాంకులు, ఉత్పత్తి జనరేషన్‌ ప్లాంట్లు కూడా వస్తాయి. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ లాంటి సదుపాయాలు ప్రతి కాలేజీలో ఏర్పాటు చేసి ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికెట్‌ పొందే స్థాయిలో నెలకొల్పుతాం.

ఆస్పత్రులు నాడు–నేడు..
‘నాడు–నేడు’ ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు దాదాపు రూ.16,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 10,111 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు, మండలానికి కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉండేలా 1,145 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కొత్తగా 176 పీహెచ్‌సీల నిర్మాణం చేపట్టాం. మొత్తంగా 1,321 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు నాడు–నేడు ద్వారా పూర్తిగా మారనున్నాయి. ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు పొందేలా చర్యలు చేపడతాం. ఐపీహెచ్‌ఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను తీర్చిదిద్దుతాం. ఇవన్నీ 2023 డిసెంబరు నాటికి పూర్తై అందుబాటులోకి వస్తాయి.

5 గిరిజన మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు..
గిరిజన ప్రాంతాల అక్క చెల్లెమ్మలు, సోదరులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు 
రూ.246 కోట్లతో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో ఐదు
గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టాం. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. రూ.272 కోట్లతో కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్‌ ఆస్పత్రుల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. 

ఆరోగ్యశ్రీ – ఆరోగ్య ఆసరా..
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో మార్పులు తెచ్చి 2,436 వైద్య చికిత్సలకు వర్తింప చేస్తున్నాం. 95 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్రచికిత్స అనంతరం కోలుకునే వరకు నెలకు రూ.5 వేలు సాయం అందచేస్తున్నాం. కంటి వెలుగు ద్వారా ఉచితంగా పరీక్షలు, కళ్లద్దాలు ఇస్తున్నాం. కాక్లియర్‌తో పాటు బైకాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ సదుపాయం కల్పించాం. అన్ని క్యాన్సర్‌ చికిత్సలను పథకంలోకి తెచ్చాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా వైద్యం చేయిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు మొదలు, మంచం, వీల్‌ చైర్లకు పరిమితమైన వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్లు ఇస్తున్నాం. కోవిడ్‌తోపాటు బ్లాక్‌ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చాం. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.680 కోట్లు బకాయిలు పెడితే వాటిని ఇవ్వడంతోపాటు ఇవాళ మూడు వారాల్లోనే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తూ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. దాదాపు 40కిపైగా సంక్షేమ పథకాలతో పాటు వైద్య ఆరోగ్య రంగంపై నిండు మనసుతో దృష్టి పెట్టాం కాబట్టే ఇవన్నీ చేయగలిగానని మీ కుటుంబ సభ్యుడిగా సగర్వంగా చెబుతున్నా.

రెండేళ్లలో రూ.5,215 కోట్లు ఖర్చు..
ఈ రెండేళ్లలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ద్వారా రూ.5,215 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం రూ.3,560 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం రూ.303 కోట్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో రూ.510 కోట్లు. 108, 104 సర్వీసుల కోసం రూ.452 కోట్లు, దీర్ఘకాల వ్యాధులు, పెన్షన్ల కింద మరో రూ.390 కోట్లు ఖర్చు చేశాం.

+ పోస్టుల భర్తీ.. 104, 108
వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు 9,712 రెగ్యులర్‌ పోస్టుల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేశాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 108, 104 సర్వీసులు కింద ఒకేసారి 1,180 వాహనాలను ప్రవేశపెట్టాం.

+ వారికి రూ.5 లక్షల సాయం..
కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో మరణించిన వారికి కేంద్రం ప్రకటించిన పరిహారం వర్తించకపోతే వారికి మన ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఇస్తాం. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌లో పని చేసేవారికి ఆ సహాయం అందచేస్తాం. కోవిడ్‌ విధి నిర్వహణలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి అందించాల్సిన సహాయంపై విధి విధానాలు ఖరారు చేయాలని సీఎస్‌ను ఆదేశిస్తున్నాం. 
((((((((((((((((కోట్స్‌))))))))))))))
+ ప్రాణం విలువ తెలుసు కాబట్టే..
‘‘మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా జనాభా అవసరాలను బేరీజు వేసుకుని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. సరైన వైద్యం అందక అన్యాయానికి గురవుతున్న ప్రతి నిరుపేదకూ మంచి వైద్య సదుపాయం వారి వాకిట్లోనే, గడప వద్దకు తీసుకురావడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ పేదలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం’’

 

నా మాంగల్యం నిలబడింది 
కరోనా బారినపడిన నా భర్త బతకడం కష్టమన్నారు. విశాఖ ఆస్పత్రికి వెళ్లడానికి 104కి కాల్‌ చేస్తే.. పావుగంట తర్వాత కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచి్చంది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రోజూ కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి ఆరా తీసేవారు. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని అడిగేవారు. ఇంతగా ఎవరూ చేయలేదు. ఎక్కడా నయాపైసా చెల్లించలేదు. నా మాంగల్యం నిలబడిందంటే మీ వల్లే. మా అనకాపల్లిలో ఇంత పెద్ద ఆస్పత్రి నిరి్మంచడం మా పూర్వజన్మ సుకృతం. 
– జయలక్షి్మ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top