Land Survey: సమగ్ర 'భూ సర్వే' పరుగెత్తాలి

CM Jagan comments in high-level review on the comprehensive land survey - Sakshi

సమగ్ర భూసర్వేపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సమగ్ర భూ సర్వే ఆలస్యం కాకూడదు. మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్‌ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్‌ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్‌ నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా రాష్ట్రంలో మంద గమనంలో ఉన్న సమగ్ర భూ సర్వే పనులను ఇక నుంచి పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్‌ నాటికి రాష్ట్రం అంతటా సమగ్ర భూసర్వే పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వే చురుగ్గా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుకున్న సమయంలోగా లక్ష్యం చేరాల్సిందేనని, క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో, అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయితే అన్నింటికీ క్లియర్‌ టైటిల్స్‌ వస్తాయని, దీంతో ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదని చెప్పారు.  

సచివాలయాల్లో అన్ని రకాల సేవలు 
ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో సహా ప్రజలకు అన్ని రకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సచివాలయాల్లో కూడా కొనసాగాలని, సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటల్‌ ఫార్మాట్‌లో పెట్టాలని ఆదేశించారు. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా దీనిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు, అన్ని రకాల శిక్షణ కార్యక్రమాల వివరాలు డిజిటల్‌ ఫార్మాట్‌ ద్వారా సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. ఒక డిజిటల్‌ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.    

తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే 
► రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే 70 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని చెప్పారు. 
► సర్వేలో పైలట్‌ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే అనంతరం, డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్‌ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు. 
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు 
పాల్గొన్నారు.

నగరాలు, పట్టణాల్లో సర్వే ఇలా.. 
పట్టణాలు, నగరాల్లో కూడా సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్‌ అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పట్టణాలు, నగరాలకు సంబంధించి మూడు దశల్లో స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. 

ఫేజ్‌–1:   2021 జూన్‌లో ప్రారంభమై,2022 జనవరి నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. 
ఫేజ్‌–2:  2022 ఫిబ్రవరిలో ప్రారంభమై, 2022 అక్టోబర్‌ నాటికి 42 పట్టణాలు, నగరాల్లో పూర్తి. 
ఫేజ్‌–3:  2022 నవంబర్‌లో ప్రారంభమై, 2023 ఏప్రిల్‌ నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top