పులివెందులలో సీఎం క్రిస్మస్‌ వేడుకలు | Sakshi
Sakshi News home page

పులివెందులలో సీఎం క్రిస్మస్‌ వేడుకలు

Published Tue, Dec 26 2023 3:47 AM

CM Jagan Christmas Celebrations In Pulivendula - Sakshi

పులివెందుల: క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా  పులివెందులలో కుటుంబ సభ్యు­లతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం సీఎం ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా భాకరాపురం హెలిప్యాడ్, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల పట్టణానికి చేరుకు­న్నారు.

ఉ.9.30 గంటలకు సీఎస్‌ఐ చర్చి ప్రాంగణా­నికి చేరుకుని అక్కడ హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్‌.. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్‌ రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్లో  పాల్గొనడం ఎంతో ఆనందాన్ని­స్తుందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందుతానన్నారు.

అనంతరం..  ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు. 2024 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత చర్చి నుంచి రోడ్డు మార్గాన సీఎం బయల్దేరి వైఎస్సార్‌సీపీ నేత నల్లచెరువుపల్లె రవి ఇంటికెళ్లి నూతన దంపతులు మంజ్రేకర్‌రెడ్డి, రేణుకారెడ్డిలను ఆశీర్వదించారు.

ఇక ఉ.11.07 గంటలకు సీఎం జగన్‌ అక్కడ నుంచి బయల్దేరి 11.15 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మ.12.19 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి మైదుకూరులోని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. 

క్రిస్మస్‌ వేడుకల్లో కుటుంబ సభ్యులు..
ఇక క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు పాల్గొన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్‌ డి. సుధ, జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, ఆర్డీఓ వెంకటేశులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలి
సీఎం వైఎస్‌ జగన్‌
సాక్షి,అమరావతి:
నిస్సహాయులపై కరుణ, సాటి­వారి­పై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యా­గం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామ­యుని ఆశీ­స్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీ­మణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోమ­వారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement