తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా?
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా?
నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా?
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా
వరుసగా మా పార్టీ సీనియర్ నేతలపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనం
తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరుతున్నా
వైఎస్సార్‌సీపీ నాయకులకు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి
సీఎం చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘‘జంగిల్ రాజ్’’గా మారిపోయిందంటూ సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోం శాఖను ట్యాగ్ చేస్తూ శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..
ఆటవిక రాజ్యాన్ని సృష్టించారు
‘‘చంద్రబాబు గారూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘‘జంగిల్‌రాజ్’’గా మారిపోయింది కదా.. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు.
పోలీసులు దాడులకు కాపలా కాశారు
మా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు గారూ.. మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు ఆయన ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం.
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే మళ్లీ కొత్త కుట్రలు
తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయ పరచినందుకు దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచి పెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు. ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం.
మీ వైఖరి అత్యంత ప్రమాదకరం
చంద్రబాబు గారూ.. మీరు ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా తయారయ్యారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం. వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వైఎస్సార్‌సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అంబటికి వైఎస్ జగన్ పరామర్శ
ధైర్యంగా ఉండాలని.. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ భరోసా
వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆయనను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ఆయనకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకీ పెరిగిపోయాయని అన్నారు. టీడీపీ మూకలు ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం, దాడులకు తెగబడ్డాయని, కూటమి అరాచక పాలనను ప్రజలు సహించబోరన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


