
కేడర్‌కు, నాయకులకు మధ్య సమన్వయం లోపించింది
టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, అందుకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడంలేదని, అలా నిర్లక్ష్యం చేస్తున్న వారి జాబితా తన వద్ద ఉందన్నారు.
ఎమ్మెల్యేలకు, కేడర్ మధ్య సమన్వయం లేకుండాపోయిందని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని వారికి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఆలోచించి వారికి మంచి చేయాలని.. అందరినీ కలుపుకుని వెళ్లకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు.
దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలి..
ఇక నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు వారిని ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చి ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులను భర్తీచేస్తామన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
అధికారులు తమ మాట వినడంలేదని, పోస్టింగ్‌ల విషయంలోనూ ఇబ్బందులున్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వాలని, ఏ చిన్న పనిచేయడానికి అవకాశం లేకుండాపోయిందని చెప్పారు. అవకాశాన్ని బట్టి నిధుల గురించి ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు.