
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా ఉపసంహరింప చేసిన నామినేషన్లను పునరుద్ధరించే అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కడైనా అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని నిర్ధారణ అయితే వాటిని పునరుద్ధరించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు గత నెల 18న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు కాగా.. వాటిపై సోమవారం తుది విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్‌ఎన్ ప్రశాంత్, వీఆర్ రెడ్డి, జీఆర్ సుధాకర్ తదితరులు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.
పత్రికా కథనాల ఆధారంగా ఎలా నిర్ణయిస్తారు
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒకే నామినేషన్ వచ్చిన చోట నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారులు ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తక్షణమే ప్రకటించి ఫారం–10, ఎంపీటీసీ, జెడ్పీసీలుగా గెలుపొందినట్టు ఫారం 29 జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రసుత కేసులో కూడా రిటర్నింగ్ అధికారులు నిబంధనల మేరకే నడుచుకున్నారని తెలిపారు. వీటిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే మార్గమని వివరించారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చేసుకుని బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషనర్ ఓ నిర్ణయానికి వచ్చారని, ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ నెల 15కి వాయిదా వేశారు.