
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పీయూసీ విద్యార్థులకు ప్రారంభం కాని తరగతులు
వారం రోజులుగా ఖాళీగా కూర్చుంటున్న విద్యార్థులు
ఫ్యాకల్టీ లేకపోవడమే కారణమని అనుమానాలు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు. సోమవారం నుంచి విద్యార్థులు రోజూ తరగతి గదులకు వెళ్లి కాలక్షేపం చేసి వస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారందరూ ఈ నెల 14వ తేదీన ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. వారికి 15 నుంచి 19 వరకు అవగాహన తరగతులు నిర్వహించారు.
ఆ తర్వాత 21 నుంచి రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తామని, 28 నుంచి స్టడీ అవర్స్ కూడా ప్రారంభిస్తామని నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. అయినా శనివారం వరకు తరగతులే ప్రారంభం కాలేదు. శుక్రవారం ఇంగ్లిష్ అధ్యాపకుడు వచ్చి పరిచయం చేసుకుని వెళ్లినట్లు విద్యార్థులు తెలిపారు. కాగా, ఇదే క్యాంపస్‌లో కొనసాగుతున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ పీయూసీ విద్యార్థులకు ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం తరగతులు మాత్రమే జరుగుతున్నాయి.
ఫ్యాకల్టీ లేకపోవడమే కారణమా?
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడం వల్లే తరగతులు నిర్వహించడం లేదని తెలిసింది. కనీసం 25 మంది ఫ్యాకల్టీ ఉండాల్సి ఉండగా, శ్రీకాకుళం నుంచి కేవలం 12 మంది మాత్రమే వచ్చారని సమాచారం. కాగా, ఈ నెల 28వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ నుంచి పీయూసీ కోసం తక్కువ మంది ఫ్యాకల్టీ వచ్చారని, నూజివీడు ట్రిపుల్ ఐటీలోని మెంటార్లకు అదనపు బాధ్యతలు అప్పగించి వారితో తరగతులు నిర్వహిస్తామని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.