
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వానికి సహకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 2015 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణా జలాలను విద్యుత్ అవసరాలకు తెలంగాణ వాడుకుంటోందని, 2021, జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో అన్యాయమంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనల ప్రారంభ సమయంలో జస్టిస్ ఎన్‌వీ రమణ ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ఉద్దేశించి.. ‘నేను ఇరు రాష్ట్రాలకు చెందినవాడిని. ఈ అంశంపై గతంలో వాదనలకు హాజరయ్యా. పిటిషన్‌లో న్యాయపరమైన అంశాలపై విచారించాలని భావించడంలేదు.
ఈ కేసులో మూడో వ్యక్తి జోక్యం అనవసరం. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామంటే ఈ ధర్మాసనం సహకరిస్తుంది. ఒకవేళ న్యాయపరంగా, కేంద్రం జోక్యం కావాలని భావిస్తే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాం’అని తెలిపారు. ఈ సూచనపై ప్రభుత్వ ఆదేశాలు తెలుసుకోవడానికి సమయం కావాలని దవే అడిగారు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ అనవసరమని తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. నోటిఫికేషన్ అప్పుడే అమలులోకి రాదని, అమలులోకి వచ్చేలోగా చాలా నీటిని నష్టపోతామని దవే వెల్లడించారు.
నీటి బోర్డులు ఇంకా ఆపరేషనల్ కాలేదని, ఈశాన్యంలో ఏం జరుగుతోందో చూస్తున్నామని చెప్పారు. ఆ తరహా ఘటనలు జరగాలని కోరుకోకూడదని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్‌వీ రమణ సూచించారు. మంగళవారానికి విచారణ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం, వారం రోజులు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరాయి. ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయానికి రావాలని పేర్కొన్న ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేసింది.