భారీ మోసం: ఫైబర్‌నెట్‌లో ‘చంద్ర’జాలం

CID Enquiry On AP Fibernet Scam Under TDP Government - Sakshi

నాలుగున్నరేళ్ల కిందట ‘మోరి’లో అట్టహాసంగా ప్రారంభం

రూ.149కే అరచేతిలో ప్రపంచమంటూ ఆర్భాటం

మూడు నెలలకే ముగిసిన ముచ్చట

సీఐడీ విచారణకు ఆదేశంతో మరోసారి చర్చ

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అరచేతిలో ప్రపంచం అంటూ అందంగా అబద్ధాలు ఆడిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నిలువునా మోసం చేశారు. సీఎంగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఏపీ ఫైబర్‌నెట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్‌ 29న జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఆర్భాటంగా శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అగ్రగామిగా నిలిచి రాష్ట్రంలో సాంకేతిక విప్లవం వచ్చేస్తుందని ఆ సందర్భంగా ప్రకటించారు. ఆ సమయంలోనే మోరి, మోరిపోడు గ్రామాలను స్మార్ట్‌ విలేజ్‌లుగా కూడా ఆయన ప్రకటించారు. కాగా, ఫైబర్‌నెట్‌ ఏర్పాటు, విధివిధానాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఐడీ విచారణకు ఆదేశించడంతో ‘మోరి’ మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

అంతా హడావుడే.. 
మోరిలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రారంభించి, నగదు రహిత లావాదేవీలంటూ ఎక్కడ లేని హడావుడీ చేశారు. ఈ గ్రామానికి ఫైబర్‌ గ్రిడ్‌ అనుసంధానమని, ఇంటింటికీ నెలకు రూ.149కే కేబుల్‌ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్‌ సౌకర్యం నట్టింట్లోకి వచ్చేస్తున్నాయని నాడు చంద్రబాబు నమ్మబలికారు. ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పల్లెలను ప్రపంచానికి అనుసంధానిస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర కల్పిస్తామని గొప్పలు చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు ఫైబర్‌నెట్‌ ప్రతి ఒక్కరికీ అవసరమని హితబోధ కూడా చేశారు. పల్లెల్లో ఇంటర్‌నెట్‌ ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఉంటుందని ప్రకటించారు.

ఫైబర్‌గ్రిడ్‌ ప్రారంభంలో 1,500 కనెక్షన్లు మంజూరు చేశారు. వీటిలో సుమారు 300 ఐపీటీవీ బాక్సులలో (టీవీకి, ఫోన్‌కు పవర్‌ సప్లయ్‌ చేసేవి) వచ్చిన సాంకేతిక లోపాలతో ప్రారంభంలోనే మూలన పడ్డాయి. కొత్తవి ఇస్తారనే ఉద్దేశంతో పని చేయని బాక్సులను తిరిగి ఇచ్చేసినా నిర్వాహకులు బాక్సులు ఇవ్వడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కనెక్షన్లు వారంలో మూడు రోజులు పని చేస్తే గొప్పేనని చెబుతున్నారు. ఇప్పటికీ ఫైబర్‌గ్రిడ్‌ సేవలకు నోచుకోని టీవీల్లో ‘నో ఇంటర్నెట్‌ యాక్సెస్‌’ అనే మెసేజ్‌ వస్తోంది. 

సమస్యలకు పరిష్కారం చూపేవారేరీ! 
ఫైబర్‌నెట్‌ కనెక్షన్లలో తలెత్తే సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యవస్థ ఏర్పాటు కాలేదు. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లకు అనుసంధానించే జీపాన్, ఐపీటీవీ బాక్సులలో సమస్య వచ్చినా ఈ మొత్తం వ్యవస్థకు కేంద్రమైన తెనాలి వెళ్లాల్సి రావడం వినియోగదారులకు భారంగా మారింది. సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించక చాలామంది ఇప్పటికే ఫైబర్‌నెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. పల్లెల్లో కనెక్షన్‌కు నెలకు రూ.149 ప్యాకేజీలో 15 మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌ వేగంతో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. వాస్తవానికి 10 మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌ వేగం మాత్రమే పొందుతున్నామని ఫైబర్‌నెట్‌ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.

ప్రస్తుతం ఉన్న కనెక్షన్లకు రూ.300 వసూలు చేస్తున్నారు. మరింత వేగం కావాలంటే మరో రూ.100 అదనపు భారం తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. చివరకు ఆ సమయంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు పంపిణీ చేసిన స్మార్ట్‌ ఫోన్లు కూడా ఎప్పుడో మూలన పడ్డాయి. నెట్‌ సక్రమంగా పని చేయక, నగదు రహిత లావాదేవీలు కూడా చతికిలపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫైబర్‌నెట్‌ ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వం విచారణ జరిపించడం ద్వారా న్యాయం జరుగుతుందని వినియోగదారులు అంటున్నారు.

పని చేయని ఇంటర్‌నెట్‌...  

ఫైబర్‌నెట్‌ తొలగించాం 
తరచూ వచ్చే సాంకేతిక సమస్యలతో ఫైబర్‌నెట్‌ సేవలను తీసేశాము. వర్షం వస్తే చాలు నెట్‌ ఆగిపోతుంది. రూ.300 (గతంలో రూ.149) ప్యాకేజీలో చెప్పిన విధంగా 15 మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. ఈ సమస్యలతో ఫైబర్‌నెట్‌ సేవలను తొలగించక తప్పలేదు. సేవల మాట దేవుడెరుగు.. మొదట్లో చంద్రబాబు చెప్పిన ప్రకారం ఫైబర్‌గ్రిడ్‌ సేవలకు రూ.149 అన్నారు. కొద్ది రోజులకే రూ.300 చేసేశారు. భారం భరించలేకపోతున్నాం. 
– వీఎస్‌ఎస్‌ శైలజ, గృహిణి, మోరి 

దోపిడీ సాగిస్తున్నారు 
ఫైబర్‌నెట్‌ ద్వారా ఆపరేటర్లు దోపిడీ సాగిస్తున్నారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.149కే ఉచిత నెట్, టీవీ అన్నారు. అనంతరం నెలకు రూ.300 వసూలు చేస్తున్నారు. సెట్‌ టాప్‌ బాక్సు, కేబుల్‌ ఇన్‌స్టలేషన్‌కు కలిపి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. 
– బడుగు శ్రీనివాసరావు, చెన్నడం, రాజోలు మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top