మీకు ప్రాణభిక్ష పెట్టింది పోలీసులే,, ఆ విశ్వాసం మరిచి అసభ్యంగా తిడతారా? 

Chittoor District Police Association fires on Kinjarapu Atchannaidu - Sakshi

అచ్చెన్నాయుడుపై చిత్తూరు జిల్లా పోలీసు సంఘం ధ్వజం 

ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు  

చిత్తూరు రూరల్‌/కుప్పం(చిత్తూరు జిల్లా)/తిరుపతి మంగళం: టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ప్రాణభిక్ష పెట్టింది పోలీసులేనని.. ఆ విశ్వాసం మరిచి ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చిత్తూరు జిల్లా పోలీసు యూనియన్‌ అసోసియేషన్‌ ధ్వజమెత్తింది. కుప్పంలో శుక్రవారం జరిగిన నారా లోకేశ్‌ పాదయాత్రలో అచ్చెన్నాయుడు పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడం పట్ల పోలీసు సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం వారు చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు ఉదయ్‌ మాట్లాడుతూ పోలీసులు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు.

ఆ విషయంలో దేశంలోనే రాష్ట్ర పోలీసుశాఖ మొదటిస్థానంలో ఉందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం లోకేశ్‌ పాదయాత్రకు దాదాపు 700 మంది భద్రత సిబ్బందిని కేటాయించిందన్నారు. అచ్చెన్నాయుడు పోలీసులపై అసభ్య పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. పోలీసులంతా తిండి కోసం రాలేదన్నారు. ఆయన సోదరుడు కూడా ఓ పోలీసు అధికారి అని.. ఈ మాట అతన్ని అడిగి మాట్లాడాలని సూచించారు.

గతంలో అచ్చెన్నాయుడిని కొందరు చితకబాది పడేసుంటే.. ప్రాణభిక్ష పెట్టింది పోలీసులేనని గుర్తుచేశారు. ఇటీవల టీడీపీ నేతలంతా పోలీసులను తిట్టడం ఓ ఫ్యాషన్‌గా మార్చుకున్నార­ని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పోలీసులకు క్షమా­పణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కలిసి అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఖాదర్‌బాషా, శరవణ, రమేష్‌ పాల్గొన్నారు.  

కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు.. 
కులమతాలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్న తేడా లేకుండా నిత్యం ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న పోలీసులను ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించేదిలేదని పోలీసు అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఏపీ పోలీసు అసోసియేషన్‌ నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కుప్పంలో అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర సలహాదారు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులను లెక్కచేయకపోవడం వల్ల చంద్రబాబు సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసి పోలీసులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. 

అచ్చెన్నపై కేసు .. 
నారా లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారని సీఐ శ్రీధర్‌ వెల్లడించారు. కుప్పం ఎస్‌ఐ శివకుమార్‌ చేసిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top