దళిత యువకుల అరెస్టులో..  పోలీసుల తీరుపై జగ్గిరెడ్డి ఆగ్రహం  | Sakshi
Sakshi News home page

దళిత యువకుల అరెస్టులో..  పోలీసుల తీరుపై జగ్గిరెడ్డి ఆగ్రహం 

Published Mon, Jul 11 2022 4:19 AM

Chirla Jaggireddy inquired about arrest of Dalit youth - Sakshi

కొత్తపేట/రావులపాలెం:  కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వివాదంలో అమాయకులైన దళిత యువకుల అరెస్టులో పోలీసుల తీరుపై స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గోపాలపురం వద్ద ఒక ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌లో ఈనెల 5న డిస్పోజబుల్‌ ప్లేట్లపై అంబేడ్కర్‌ చిత్రం ఉండటంపై తలెత్తిన వివాదం కేసులో ఒక వర్గానికి చెందిన ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, మరో వర్గానికి చెందిన 18 మంది దళిత యువకులపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.

నాలుగు రోజులుగా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో నిమగ్నమైన ప్రభుత్వ విప్‌ ఆదివారం రావులపాలెం చేరుకున్నారు. దళిత యువకుల అరెస్టుపై ఆరా తీశారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహంతో అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలతో రావులపాలెం సెంటర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. తానులేని సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వివాదాన్ని రాజకీయం చేస్తూ వైఎస్సార్‌సీపీకి, తనకు ఆపాదించేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు.

తమ కుటుంబం ఆది నుంచీ దళిత పక్షపాతిగా సాగుతోందన్నారు. తానులేని సమయంలో జరిగిన ఘటనను కుట్రపూరితంగా గోరంతను కొండంత చేసి రాజకీయంగా బురదజల్లేందుకు ప్రయత్నించడం తగదని జగ్గిరెడ్డి ఖండించారు. అరెస్టయిన 18 మంది దళిత యువకుల్లో తమ గ్రామానికి చెందిన వారు 10 మంది ఉన్నారని.. అలాగే, పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది ఉన్నారన్నారు.

కేసు విషయంలో పోలీసులు అత్యుత్సాహంగా చూపి కేసులు నమోదు చేయడాన్ని నిరసించారు. దళిత యువకుల అరెస్టులో తన ప్రమేయం ఉన్నట్లు ప్రతిపక్షాలు రుజువు చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. అనంతరం.. రావులపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి ఎస్సై చాంబర్‌ వద్ద బైఠాయించారు. అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ స్టేషన్‌కు చేరుకుని జగ్గిరెడ్డితో చర్చలు జరిపారు.   

దళిత యువకులకు న్యాయం చేస్తా : విక్టర్‌ప్రసాద్‌ 
ఇక ఈ ఘటనలో అరెస్టయిన దళిత యువకులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎం. విక్టర్‌ప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గోపాలపురం చేరుకున్న ఆయన బాధితులతో సమావేశమై వివాదంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసుల్లో అరెస్టయిన దళిత యువకులను వారం రోజుల్లో బయటకు తీసుకువచ్చేందుకు ఎస్సీ కమిషన్‌ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ తదితరులు రాగా వారిని స్థానిక దళితులు వ్యతిరేకిస్తూ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో విక్టర్‌ ప్రసాద్‌ ఒక్కరే దళితులతో సంప్రదింపులు జరిపారు.  

Advertisement
Advertisement