Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాక్..పెరిగిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Meat Price On Rise, Touched Rs 300 Per Kg - Sakshi

మండపేట(కోనసీమ జిల్లా): శ్రావణ మాసంలోను చికెన్‌ ధర దిగి రావడం లేదు. రూ.300కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.
చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?

రోజూ 3.2 లక్షల కిలోల వినియోగం 
తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్‌ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆయా జిల్లాల్లోని రాజానగరం, ఆలమూరు, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్‌ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్‌ కోళ్లు వినియోగానికి వస్తాయి.

పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తికమాసం పూజల నేపథ్యంలో శ్రావణమాసం నుంచి కార్తికమాసం ముగిసే వరకు చికెన్‌ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి 
కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా దిగిరావడం లేదు. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్‌ కిలో కోడికి రూ.110 వరకు ఖర్చవుతుందంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించేందుకు బ్రాయిలర్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

కాగా కంపెనీలు ఇస్తున్న కమీషన్‌ సరిపోవడం లేదంటూ ఇటీవల సమ్మె చేయడం కొత్త బ్యాచ్‌లపై కొంత ప్రభావం పడిందంటున్నారు. స్థానికంగా కోళ్ల పెంపకం తగ్గడంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తెలంగాణలోని ఖమ్మం, ఆశ్వారావుపేట, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో శ్రావణమాసమైనప్పటికి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం స్కిన్‌లెస్‌ కిలో రూ.300కు చేరగా, లైవ్‌ కిలో రూ.160 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.

మేత ధరలు తగ్గితేనే  కొత్త బ్యాచ్‌లు 
అన్‌ సీజన్, మేత ధరలకు భయపడి చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర పెరుగుతోంది.  
– బొబ్బా వెంకన్న, బ్రాయిలర్‌ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top