బెస్తల బాగు సీఎం జగన్‌తోనే సాధ్యం

Chelluboina Venugopala Krishna Comments Bestha Caste Welfare - Sakshi

బెస్తల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బెస్తల బాగు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డితోనే సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో బెస్తలకు భరోసా వైఎస్సార్‌సీపీతోనే లభించిందని తెలిపారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదల సీఎం జగన్‌ ఆశయమని పేర్కొన్నారు. మత్స్యకారుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా ఆయా ప్రాంతాల్లో పిలిచే పేర్ల ఆధారంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బెస్త కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ తెలుగు సుధారాణి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన బెస్త కులస్తుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కులాల మధ్య వ్యత్యాసాలు చూపకుండా బీసీలలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌  కోరిక అని చెప్పారు.

తమ కులం పేరు చెప్పుకోవడానికి కూడా భయపడే కులాలను గుర్తించి, వాటికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా కులస్తులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా వారికి భరోసా కల్పించిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని తెలిపారు. దీనికి కర్త, కర్మ, క్రియ అయిన సీఎం జగన్‌కు బీసీలుగా తాము ఏం చేసినా రుణం తీర్చుకోలేమన్నారు. అన్ని రంగాల్లో ఎదిగే స్వేచ్ఛ, అధికారం సీఎం జగన్‌ బీసీలకు ఇచ్చారని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక్క సీఎం జగన్‌ వల్లే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, వైఎస్సార్‌సీపీ వల్లే సమస్యలు తీరతాయని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని లబ్ధి చేకూర్చేలా సీఎం ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే పింఛన్లు ఎత్తేశారనే తప్పుడు ప్రచారంతో ప్రతిపక్షాలు ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నట్లు తెలిపారు. అలాంటి అవాస్తవాలను తిప్పికొట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలని కోరారు.  

బీసీలను బలోపేతం చేసేందుకే.. 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను బలోపేతం చేసేందుకే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో కులసంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారులకు మేలు చేసేందుకే ప్రభుత్వం 217 జీవో తెచ్చినట్లు చెప్పారు. దీనిపై తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తోందని, ఈ జీవోను అడ్డం పెట్టుకుని మత్స్యకారుల భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వడ్డీలు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సైదు గాయత్రిసంతోషి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్, నవరత్నాలు నారాయణమూర్తి, బెస్త కుల నాయకులు కందుకూరు సోమయ్య, బోలా నారాయణ, బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top