ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మరింత మందికి అవకాశం

సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లోకి ప్రయాణికుల అనుమతికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు జరిగాయి. అన్ని సీట్లలోకి ముందుగా ఒక్కో ప్రయాణికుడు కూర్చునేందుకు అనుమతించి.. ఆ తర్వాత రెండో ప్రయాణికుడికి అవకాశం కల్పిస్తామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.బ్రహ్మానందరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదాహరణకు పల్లెవెలుగు బస్సులో ముగ్గురు కూర్చునే సీట్లు 11, ఇద్దరు కూర్చునే సీట్లు 9 ఉంటాయి. మొదటిగా ముగ్గురు కూర్చునే సీట్లలోకి ఒక్కొక్క ప్రయాణికుడిని అనుమతించి.. అన్నీ నిండిన తర్వాత పక్కన రెండో ప్రయాణికుడు కూర్చునేందుకు అవకాశమిస్తారు.
అలా ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరూ నిండిన తర్వాత.. అవసరమైతే ఇద్దరు కూర్చునే సీట్లలోకి కూడా రెండో ప్రయాణికుడిని అనుమతిస్తారు. నిలబడి ప్రయాణించడానికి మాత్రం అనుమతించరు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందే. ఇప్పటికే బస్‌స్టేషన్లలోని అన్ని స్టాళ్లలో మాస్క్‌లు విక్రయించేలా ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలిచ్చింది. నిబంధనలను తప్పకుండా పాటించాలని కండక్టర్లు, డ్రైవర్లను యాజమాన్యం ఆదేశించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి