
దేవుడి మాన్యాల పందేరానికి సర్కారు సిద్ధం
వేలం లేకుండా దేవుడి భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్
నచ్చిన సంస్థకు.. నచ్చిన ధరకు లీజుకిచ్చే వెసులుబాటు
ఖరీదైన భూములు కర్పూరంలా కైంకర్యానికి సరికొత్త ఎత్తుగడ
కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డిదారిన భూములు కేటాయించేందుకు పన్నాగం
దేవుడి భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులు బేఖాతర్
టీడీపీ కూటమి సర్కారు తీరుపై ధార్మిక సంఘాల ఆందోళన
వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడి ఆలయాలకు మంచి ఆదాయం దక్కే అవకాశం
రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములు.. ఇప్పటికే కబ్జా కోరల్లో 87 వేల ఎకరాలు
ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపరంగా అడ్డుకోవాలి: మాజీ సీఎస్ ఐవైఆర్
సాక్షి, అమరావతి: దేవుడి మాన్యాలను తమకు నచ్చినవారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి హారతి కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది! రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూములపై కన్నేసి ఇకపై ఎలాంటి వేలం లేకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపింది. వీటిని సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వాటికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈమేరకు మే 2వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 139 విడుదల చేసింది. క్యాబినెట్ ఆమోదం లేకుండా అడ్డదారిలో పని పూర్తి కానిస్తుండటం గమనార్హం. అదే దేవాలయాల భూములకు పారదర్శకంగా వేలం నిర్వహిస్తే పలువురు పోటీపడి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అలాంటప్పుడు వేలం లేకుండా విలువైన భూములను ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? రూ.వేల కోట్ల ఆస్తులను అప్పగిస్తూ చట్ట సవరణ చేయడం ఎవరి ప్రయోజనం కోసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
భారీ కుంభకోణం జరుగుతున్నట్లు అక్కడే అర్థమవుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో దేవదాయ శాఖ పరి«ధిలోని 4.67 లక్షల ఎకరాల దేవుడి భూముల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే పలు సంస్థలు ఎలాంటి వేలం లేకుండా లీజు పేరుతో దేవుడి భూములను దక్కించుకునేందుకు ప్రతిపాదనలతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వివిధ దేవాలయాలకు చెందిన అత్యంత ఖరీదైన ఆస్తులకు ఎసరు పెడుతూ, భూములను కైంకర్యం చేస్తూ టీడీపీ సర్కారు నిర్ణయాలు తీసుకోవడంపై ధార్మిక సంఘాలు, హైందవ ధర్మ పరిరక్షణ సంస్థలు మండిపడుతున్నాయి. వేలం లేకుండా ఇచ్చేందుకు 2003 నాటి చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదించడం దారుణమని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఏడాదిగా పవిత్ర పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో వరుసగా అపచారాలు, అన్యూహ ఘటనలు చేసుకుంటుండగా ఇప్పుడు ఏకంగా ఆలయాల ఉనికికే ముప్పు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.