
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పర్మిట్ రూమ్‌ల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్ లిక్కర్ ఇస్తానని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. బెల్టు షాపులు భారీ ఎత్తున అధికారిక,అనధికారిక అనుమతులిచ్చారు.
ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై వెల్లు వెత్తుతున్నాయి.
ఈ క్రమంలో విచ్చల విడిగా తాగి తూగడానికి మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చే చర్యలకు చంద్రబాబు ఉపక్రమించారు. గతంలో ఉన్న 4500 పర్మిట్ రూమ్‌లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.కానీ ఇప్పుడు నేరాలు, ప్రమాదాలకు కారణమైన పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వాటిని తెరపైకి తెచ్చింది.