
తుంగభద్ర డ్యాం 19 గేటు కొట్టుకుపోవడంతో వృథాగా పారుతున్న నీరు(ఫైల్)
గత ఏడాది వరదకు కొట్టుకుపోయిన డ్యాం గేటు
రూ.1.98 కోట్లతో కొత్త గేటు.. డిజైన్ ఆమోదంలో జాప్యం
కొత్త గేటు ఏర్పాటుకు రెండు నెలలే గడువు
గేటు బిగింపు మొదలయ్యేలోపు వర్షాలొచ్చే అవకాశం
తుంగభద్ర జలాశయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. అలాంటి ఈ ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతేడాది వరద నీటి ప్రవాహానికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటు అమర్చారు. దాని స్థానే కొత్త క్రస్ట్ గేటు ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. అయితే దీన్ని కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నిపుణుల నివేదిక ప్రకారం రూ.1.98 కోట్లతో కొత్త గేటు ఏర్పాటుకు గుజరాత్‌కు చెందిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు.
ఆ కంపెనీ తయారు చేసిన గేట్ డిజైన్‌ను ఏపీ సెంట్రల్ డిజైన్ కమిటీ ఇటీవలే ఆమోదించింది. టెండర్ దక్కించుకున్న కంపెనీకి గేటు బిగించేందుకు రెండు నెలల గడువు ఇచ్చారు. గేటు బిగింపు పనులు మొదలు పెట్టేలోపు డ్యాం ఎగువన వర్షాలు అధికమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇప్పటికే తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 6,700 క్యుసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాంలో నీటి సామర్థ్యం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 10.45 టీఎంసీల నీరు ఉంది. –కర్నూలు సిటీ
‘కూటమి’కి ముందు చూపేది?
గతేడాది ఆగస్టు 10న వరద నీటి ప్రవాహానికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది. అదే నెల తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేశారు. కాగా, 8 నెలలు ఆ గేటు గురించి పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు హడావుడి చేస్తోంది. గతేడాదిలోనే టెండర్ పిలిచి, డిజైన్‌కు ఆమోదం తీసుకొని ఉంటే వర్షాలు మొదలయ్యే సరికి గేటు ఏర్పాటు పూర్తయ్యేది. ఇప్పుడు రెండు నెలల సమయంలో పనులు పూర్తి కాకపోతే డ్యాంలో నీటి నిల్వలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అప్పటి లోపు చేయకుంటే కష్టమే...!
వారం రోజుల్లోపు పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుంగభద్ర డ్యాంలో 41 టీఎంసీలకు నీటి నిల్వలు చేరేలోగా కొత్త 19వ గేటు బిగింపు పనులు పూర్తి కావాలి. లేదంటే వరద నీరు గేట్లను తాకుతుంది. ఆ సమయంలో ఎలాంటి పనులు సాధ్యం కావని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త గేటు డిజైన్‌కు ఆమోదం
తుంగభద్ర డ్యాం 19వ గేటు గతేడాది వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో నిపుణుల పర్యవేక్షణలో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేశారు. కొత్త గేటు ఏర్పాటుకు రూ.1.98 కోట్లతో టెండర్లు ఖరారు చేశాం. డిజైన్‌కు ఆమోదం లభించింది. పనులు మొదలు పెట్టేందుకు ఆదేశాలిచ్చాం. – నారాయణ నాయక్, టీబీ డ్యాం ఎస్‌ఈ