పాత కంపెనీకే కొత్తగా భూ కేటాయింపులు
భారీ పెట్టుబడులంటూ ఊకదంపుళ్లు
బక్కన్నపాలెంలో ఇప్పటికే ఉన్న సెయిల్స్ సాఫ్ట్‌వేర్
ఇప్పుడు ఐటీ హిల్స్‌లో భూ కేటాయింపులు
కొత్తగా కంపెనీ వస్తోందంటూ ప్రచారం
20 ఏళ్లుగా ఉందంటున్న మరో కంపెనీ
పట్టుమని 500 మంది ఉద్యోగులూ కరవు
ఈ కంపెనీ ఐదేళ్లలో 2 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని ఒప్పందం
ముందు రోజే వచ్చి భూమి పూజ చేసిన మంత్రి లోకేశ్
భూ సంతర్పణ కోసం తిమ్మిని బమ్మిని చేస్తున్న చంద్రబాబు సర్కారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచిపెడదామనుకున్న వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త పంథాలో వెళుతోంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ.. కొత్త కంపెనీ వస్తోందంటూ ఊదరగొడుతోంది. విశాఖపట్నం జిల్లా బక్కన్నపాలెంలోని 80 ఫీట్ రోడ్డులోని ఈశ్వర్‌సాయి ఎన్‌క్లేవ్‌లో సెయిల్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో ఇదే కంపెనీ విశాలాక్షినగర్‌లో ఉండేది.
అక్కడి నుంచి బక్కన్నపాలేనికి మారింది. ఐటీ హిల్స్‌లో కూడా ఈ కంపెనీ కార్యాలయం ఉంది. అయితే, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఐటీ హిల్స్–3లో మంత్రిలోకేశ్ స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకాకుండా ఇది కొత్త కంపెనీ అంటూ ఊదరగొడుతున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు వైజాగ్ చేరుకున్న లోకేశ్.. ముందస్తు ఒప్పందాలంటూ హడావుడి చేశారు. గురువారం ఐటీ హిల్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా సందడి కనిపించేందుకు గీతం కాలేజీకి చెందిన విద్యార్థులకు సూట్స్ వేసి మరీ కార్యక్రమానికి తరలించారనే విమర్శలున్నాయి.
విలువైన భూములు కట్టబెట్టేందుకే..
‘శ్రీ తమ్మిన సొల్యూషన్స్’ పేరుతో విశాఖ శంకరమఠం రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ తమ్మిన సొల్యూషన్స్‌ది కూడా ఇదే కథ. ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్నది కేవలం 500 మంది లోపు ఉద్యోగులే. అయితే, రానున్న ఐదేళ్లలో కేవలం ఏపీలోని పెట్టుబడుల ద్వారానే 2వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటిస్తున్నారు.
2005లో ఏర్పడిన ఈ కంపెనీ రెండు దశాబ్దాలుగా కల్పించిన ఉద్యోగాల కంటే నాలుగు రెట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఈ కంపెనీకి ఇప్పుడు ఐటీ హిల్స్–2లో భూమిని కేటాయించడమే కాకుండా, భారీగా ఉపాధి లభిస్తుందంటూ లోకేశ్ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న కొన్ని కంపెనీలకు విలువైన భూములను తక్కువ ధరకు అప్పగించేందుకు ఈ నాటకాలను తెరమీదకు తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు 99 పైసలకే ఎకరా భూమి అంటూ వైజాగ్‌లోని విలువైన భూములను ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. పెద్దగా ఉపాధి కల్పించని కంపెనీలకు కూడా భారీగా భూ సంతర్పణ చేస్తోంది. అప్పనంగా భూములు అప్పగించడానికి, విశాఖలో భారీగా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ ప్రచారం చేసుకునేందుకే వీలుగా ఈ వ్యవహారాలు సాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
విశాఖ జిల్లా బక్కన్నపాలెంలో చాలాకాలంగా కొనసాగుతున్న సెయిల్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇది..


