అదనపు వ్యాట్‌ బాబు వేసిందేగా?  | Sakshi
Sakshi News home page

అదనపు వ్యాట్‌ బాబు వేసిందేగా? 

Published Mon, Feb 6 2023 3:47 AM

Chandrababu Itself added additional VAT On Petrol And Diesel - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడి హయాంలోనూ అదే 31 శాతం వ్యాట్‌. ఇప్పుడూ అదే వ్యాట్‌. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్‌ రెండింటిపైనా లీటర్‌కు 4 రూపాయలు అదనపు వ్యాట్‌ విధించారు. ఇప్పుడూ అదే అదనపు వ్యాట్‌ కొనసాగుతోంది. కాకపోతే చంద్రబాబు హయాంలో రోడ్లను పట్టించుకోకపోవటంతో... దారుణంగా తయారైన రహదారుల మరమ్మతుల కోసం ఈ ప్రభుత్వం లీటరు డీజిల్, పెట్రోల్‌పై ఒక రూపాయి సెస్‌ను మాత్రం వసూలు చేస్తోంది.

విచిత్రమేంటంటే ‘ఈనాడు’కు గానీ.. పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న దాని అధిపతి రామోజీరావుకు గానీ ఈ పన్నులన్నీ మునుపటి నుంచే కొనసాగుతున్నాయన్న వాస్తవం తెలిసి కూడా తెలియనట్టే వ్యవహరిస్తుండటం!!. ఇప్పుడేదో కొత్తగా పన్నులు పెంచేసినట్లు... దీనివల్ల ఇంధన ధరలు రాత్రికి రాత్రే హఠాత్తుగా పెరిగిపోయినట్లు ‘ఈనాడు’ రాసిన కథనం చూస్తే ఎవ్వరికైనా ‘ఔరా..!’ అనిపించకమానదు.

పైపెచ్చు తాను పెంచిన అదనపు వ్యాట్‌ 4 రూపాయలు కాగా... కేవలం ఎన్నికలకు మూడునాలుగు నెలల ముందు ఏదో ఉపశమనం ఇస్తున్నట్లుగా అందులో 2 రూపాయలు తగ్గించారు చంద్రబాబు. తన పదవీకాలం మొత్తం పెంచిన ఛార్జీల్ని వసూలు చేసి... చివర్లో నాలుగు నెలలు ఎన్నికల్లో ఓట్ల కోసం... అందులోనూ సగం మాత్రమే తగ్గిస్తే... అప్పట్లో ‘ఈనాడు’ దీన్ని ప్రశ్నిస్తే ఒట్టు!. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనని ఒక్క అక్షరం కూడా రాయని రామోజీరావు... ఇప్పుడూ అవే ఛార్జీలను కొనసాగిస్తున్నా.. ఏదో రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరల్ని పెంచేసినట్లు వార్తలు రాయటం చూస్తే ఇదెక్కడి పాత్రికేయమని అనిపించకమానదు.
 
పన్నులన్నీ కేంద్రానివేనని తెలియదా? 
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలను బట్టే దేశంలో ధరలు పెరగటం, తగ్గటం జరుగుతోందన్నది వాస్తవం. కాకపోతే అంతర్జాతీయంగా బాగా తగ్గినపుడు... కేంద్రం ఆ ఉపశమనాన్ని వినియోగదారులకు బదలాయించటం లేదు. రకరకాల పన్నులను పెంచటం ద్వారా ఆ ప్రయోజనాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది.

ఇలా కేంద్రం అదనపు ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్‌ల పేరుతో పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచడం వల్లే ఇంధన ధరలు భగ్గుమంటున్నాయన్నది రామోజీరావుకు తెలియనిదేమీ కాదు. నిజం చెప్పాలంటే ఇంధన ధరలు రూపాయి అటూఇటుగా ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా ఉన్నాయి. ఒక పక్క చార్జీలు, సెస్‌లు పేరిట కేంద్రం వాతలు పెడుతుంటే వాటిపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపటం చూస్తుంటే రామోజీరావు ఏ స్థాయికి దిగజారుతున్నారన్నది అర్థం కాక మానదు.  


► ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో గణనీయంగా తగ్గినప్పటికీ దేశీయ మార్కెట్‌లో అందుకు అనుగుణంగా ధరలను తగ్గించలేదు. 2019 మే నెలలో లీటరు పెట్రోలు రూ.76.89, డీజిల్‌ రూ.71.50 చొప్పున ఉండగా 2021 నవంబర్‌ 1న పెట్రోలు రూ.115.99, డీజిల్‌ రూ.108.66కి పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్‌ లీటర్‌ రూ.111.87, డీజిల్‌ రూ.99.61 ఉంది. 

► పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతం. నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది కనక సెస్‌లు, సర్‌ చార్జీలు, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, అదనపు ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీ పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. 

►పెట్రో ఉత్పత్తుల విక్రయాలపై వార్షికంగా రూ.3.35 లక్షల కోట్లు వసూలవుతున్నా రాష్ట్రాలకు ఇస్తున్న వాటా రూ.19,475 కోట్లు (5.8%) మాత్రమే. వాస్తవానికి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటాగా 41 శాతం పంచాల్సి ఉంది. అయితే పెట్రో ఆదాయం ఇలా డివిజబుల్‌ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌చార్జీ రూపంలో కేంద్రం సుమారు రూ.2,87,500 కోట్లు వసూలు చేస్తోంది. ఈ వాస్తవం ‘ఈనాడు’కు తెలియదనుకోలేం!!.  

► టీడీపీ అధికారంలో ఉండగా రహదారులపై దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణ లోపం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఏటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేపట్టింది ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరుపై కేవలం రూ.1 మాత్రమే సుంకంగా విధించాల్సి వచ్చింది.

ఇది మినహా వ్యాట్‌ గానీ, గత సర్కారు విధించిన అదనపు నాలుగు రూపాయలకు మించిగానీ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఒక్క పైసా పెంచలేదు. గత ప్రభుత్వంలో ఉన్నట్లే వ్యాట్, అదనపు రూ.నాలుగు ఇప్పుడూ ఉన్నాయి. మరోవైపు కోవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రాబడిని కోల్పోయింది. అయినప్పటికీ వాహనదారులపై భారం మోపలేదు. 

Advertisement
Advertisement