
కడపలో ఆత్మస్తుతి.. పరనింద తరహాలో టీడీపీ మహానాడు
ఎన్నికల హామీల అమలు గురించి ప్రస్తావనే లేని వైనం
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి గొప్పలు
వైఎస్ జగన్‌ను దూషించడం, వారిని పొగుడుకోవడమే పని
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి వారసులు లేకుండానే నిర్వహణ
కార్యక్రమంలో కనిపించని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
లోకేశ్‌ను భవిష్యత్ నాయకుడిగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం
ఎన్టీఆర్ ఏఐ వీడియో బూమరాంగ్.. 1995నాటి ఎన్టీఆర్ ప్రసంగం వైరల్
క్రమేపీ నందమూరి వంశస్థులను దూరం చేస్తున్న నారా వారు
జూ.ఎన్టీఆర్‌కు బాలకృష్ణతో అడ్డుకట్ట
పూర్తిగా అబద్ధాలు, కట్టుకథలతో టీడీపీ నేతల హంగామా
ఆరు శాసనాలంటూ సూపర్ సిక్స్ తరహాలో మరో మోసానికి తెర
కార్యకర్తే అధినేత అని చెప్పినరోజే మహిళా నేత ఆత్మహత్యాయత్నం
డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించి జనం వచ్చినట్లు చిత్రీకరణ
సాక్షి ప్రతినిధి, కడప, అమరావతి: ఏడాదిలో చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు..! అంతా ఆత్మస్తుతి.. పరనింద..! వ్యవస్థాపకుడి కుటుంబాన్ని పక్కకునెట్టి.. సొంత కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు సీఎం ఎత్తులు..! ఇదీ టీడీపీ మూడు రోజులపాటు కడపలో నిర్వహించిన మహానాడు తీరు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేక పోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడ్డారు. వాగ్దానాలను నెరవేర్చలేని వైఫల్యాన్ని మరుగున పడేసేలా ప్రత్యర్థిపై దూషణలతో దాడికి దిగారు.
మరోవైపు మహా నాడును.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసులు లేకుండానే నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ మహానాడులో బాలకృష్ణ కనిపించలేదు. దీంతో పూజించిన కేడర్ చేతులతోనే ఎన్టీఆర్‌ను ఛీ కొట్టించి ఆయన్నుంచి పార్టీని లాక్కున్న సీఎం చంద్రబాబు.. టీడీపీలో క్రమేపీ నందమూరి వంశానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నారా లోకేశ్ నాయకుడనేలా..
మంత్రి నారా లోకేశ్‌ను పార్టీలో ప్రమోట్ చేసేందుకు నందమూరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు క్రమేపీ దూరం పెడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి దూసుకెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆయనను కొనసాగిస్తే తనయుడు లోకే‹శ్ రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది అని చంద్రబాబు భావించారు. క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంపెట్టారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణను ముందుపెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ అవసరమూ తీరిందనే భావనతో తాజాగా మహానాడులో ఆయన కనిపించకుండా చేశారని అభిమానులు వాపోతున్నారు. టీడీపీ పూర్తిగా నారా వారిదేనని, ఎన్టీఆర్ వంశానిది కాదని కేడర్‌కు చెప్పేందుకే నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
పరనిందలతో ఆత్మానందం
కడప మహానాడులో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అదే పనిగా దూషించడం, లేనిపోని నిందలు మోపి సంబరపడడానికే టీడీపీ నేతలు ఎక్కడ లేని ఉత్సాహం చూపారు. చంద్రబాబు, లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తడం, చేయని పనుల గురించి అభూత కల్పనలతో గొప్పగా చెప్పుకొంటూ చంద్రబాబు ఆయన పరివారం ఆత్మానందం పొందింది.
కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించామంటూ ఊదరగొట్టడమే తప్ప కడప ప్రాంతానికి ఇన్నేళ్లలో ఏం చేశారో ఒక్కమాట చెప్పలేకపోయారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా ఏఐ వీడియో ప్రదర్శించడం బెడిసికొట్టింది. బాబు గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.
తీర్మానాలు పోయి శాసనాలు వచ్చె..
సాధారణంగా మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలు అంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి బాబు తన తనయుడు లోకేశ్‌తో చెప్పించారు. ఈ శాసనాలేమిటని తమ్ముళ్లు బుర్రగోక్కుంటూ చర్చించుకున్నారు.
కార్యకర్తలే బలం అన్న రోజే బలవన్మరణ యత్నం
ఆరు శాసనాల్లో గొప్పగా చెప్పినవాటిల్లో కార్యకర్తే అధినేత. కానీ, అదే రోజు కడపలో మహిళా కార్యకర్త తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఎమ్మెల్యే మాధవి తమను అణచివేస్తున్నారని ఆమె బలవన్మరణానికి సిద్ధమైంది. దీన్నిబట్టి టీడీపీలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అర్థం పర్థం లేని శాసనాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత పదికి పైగా తీర్మానాలు చేసినా వాటిలో పస లేకుండాపోయింది.
వాటిని ఎందుకు చేశారో, ఉద్దేశం ఏమిటో కూడా చెప్పలేకపోయారు. చివరగా రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. గతంలో యనమల రామకృష్ణుడు ప్రతిపాదించేవారు. ఈసారి యనమల వేదిక మీద ఉన్నా.. రామ్మోహన్‌నాయుడుతో తీర్మానం చేయించి సీనియర్ల అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి భారీగా జనం వచ్చినట్టు చిత్రీకరించడం విమర్శలకు దారి తీసింది.
టీడీపీ నేత ఫిర్యాదుతో 15 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు
ముందుగా వైఎస్సార్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకుని.. ఆపై ఫిర్యాదు తెప్పించుకుని కేసులు నమోదు చేస్తున్న అపఖ్యాతిని పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు మూటగట్టుకున్నారు. బుధవారం నమోదు చేసిన ఓ కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసుల అదుపులో ఉండిపోయారు. కడపలో మహానాడు నిర్వహణను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు.
వారి దురుద్దేశం, దుశ్చర్యలను గమనించిన వైఎస్సార్‌సీపీ నేతలు మున్సిపల్ కమిషనర్, సబ్ డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో కోరారు. కానీ, దీనిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ కేడర్ వాటిని తొలగించింది. ఈ చర్యలో ఎలాంటి గొడవ, ఘర్షణ చోటుచేసుకోలేదు. తర్వాత కూడా టీడీపీ వర్గీయులు వైఎస్సార్ విగ్రహాలకు జెండాలు, తోరణాలు కట్టి సవాళ్లు విసిరారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్లో టీడీపీ నేతలను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ వారికే వత్తాసు పలికింది. టీడీపీ నేతలు చెప్పగానే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసు ప్రతాపం చూపారు. అప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకపోగా, టీడీపీ నేత అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి నుంచి ఓ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారని సమాచారం.
విజయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ స్టేషన్‌లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ వెంకటపతి తదితరులపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మంది బుధవారం రాత్రి నుంచి పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నారు. కోర్టులో హాజరుపరచకుండా గురువారం సాయంత్రం వరకు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసు స్టేషన్లు మారుస్తూ వారిని కొడుతూ వచ్చారు. దీంతో పులివెందుల పోలీసులు.. పసుపు నేతలు ఎలా చెబితే అలా ఆడుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.