మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి
మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కారు
ఇప్పటికే గతేడాది 50 శాతం పెంపు
వరుసగా రెండో ఏడాదీ పెంచుతుండడంపై ఆందోళన
ఈసారి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి ముసుగు
పేరుకే అర్బన్ ప్రాంతాలు.. 90 శాతం ఏరియాను కవర్ చేస్తూ పెంపు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఆ పని చేయలేకపోగా ప్రజల నడ్డి విరుస్తూ పెను భారాలను మోపడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను మరోసారి భారీగా పెంచి జనం నెత్తిన బండ మోపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్థిరాస్తుల మార్కెట్ విలువలు సవరించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి మెమో జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం ఖరారైంది.
ఎంత మేర పెంచుతున్నారనే దానికి సంబంధించిన లాంఛనాలు మాత్రమే మిగిలాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కనీసం 40 నుంచి 50 శాతం మేర పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విలువలు దాదాపుగా ఖరారైనట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆమోదం తీసుకోవడమే మిగిలి ఉంది. దీనిపై డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు తుది కసరత్తు చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం ఇదే పని మీద వారిపై ఒత్తిడి తెస్తోంది. రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో మార్కెట్ విలువల సవరణ ప్రతిపాదనలకు అధికారుల కమిటీలు ఆమోదం తెలపనున్నాయి. వాటి ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్కెట్ విలువలు పెరగనున్నాయి. అదే రోజు నుంచి పెరిగిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ముసుగు
కేవలం అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే మార్కెట్ విలువల సవరణ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా దాని వెనుక కుయుక్తి కనబడుతోంది. అర్బన్ ప్రాంతాలు అంటే కేవలం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో మాత్రమే విలువలను సవరించాలి. అధికారికంగా జారీ చేసిన మెమోలో అదే విషయాన్ని పేర్కొన్నా వాస్తవానికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో విలువలు సవరిస్తున్నారు. అంటే దాదాపు 90 శాతం ఏరియాపై పెంపు ప్రభావం ఉండనుంది. ప్రభుత్వం చెబుతున్న అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే పెంపు ఉంటే సీఆర్‌డీఏ పరిధిలో కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విజయవాడ, గుంటూరు, తెనాలి, గుడివాడ లాంటి పట్టణాల్లో మాత్రమే పెంపు ఉండాలి. కానీ సీఆర్‌డీఏ పరిధి అంతటా మార్కెట్ విలువలు సవరిస్తుండడంతో పెద్దగా ఆదాయం రాని మారుమూల గ్రామీణ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్ విలువలు పెరగనున్నాయి.
రాష్ట్రంలో 90 శాతం ప్రాంతంపై ప్రభావం..
సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న 27 నియోజకవర్గాల్లో మార్కెట్ విలువలు పెంచుతున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో విశాఖ నగరంతోపాటు భీమునిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలున్నాయి. ఆ ఏరియా మొత్తం మార్కెట్ విలువలను సవరించనున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరితోపాటు చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు జిల్లా కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో మార్కెట్ విలువలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతంలో, అది కూడా ఆదాయం వచ్చే ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరిస్తుండటం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లో మార్కెట్ విలువలు సవరించినా, సవరించకపోయినా ఒకటే. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాలను వదిలేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంచలేదని ప్రచారం చేసుకోవడానికి దీన్ని వినియోగించుకుంటున్నారు.
జగన్ హయాంలో ఒక్కసారి సాధారణ రివిజన్
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2014–19 మధ్య వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక ఒకసారి మాత్రమే సాధారణ రివిజన్ చేసింది. 2020లో మాత్రమే మార్కెట్ విలువలను రాష్ట్రమంతా సవరించింది. 2022లో కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో అక్కడ చాలా నామమాత్రంగా, 2023లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేకంగా విలువల సవరణ జరిగింది. ఆ ఐదేళ్లలో ఒకసారి మాత్రమే రాష్ట్రమంతా సాధారణ రివిజన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి సాధారణ రివిజిన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడంతో స్థిరాసుల క్రయవిక్రయాలపై ప్రభుత్వానికి వచ్చే రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. దాన్ని కవర్ చేసుకునేందుకే వరుసగా రెండో ఏడాది కూడా మార్కెట్ విలువల్ని సవరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.


