
విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు
రిజర్వేషన్ కోసం పోరాడిన కాపులపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు
తుని కేసు తిరగదోడేందుకు తాజాగా సర్కారు నిర్ణయం
కాపులపై కేసులు కొట్టేస్తూ 2023లో తీర్పునిచ్చిన విజయవాడ రైల్వే కోర్టు
దీనిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం
అందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశం.. ఉత్తర్వులూ జారీ
ప్రభుత్వ నిర్ణయంపై కాపు సామాజికవర్గం ఆగ్రహం
తమ భావోద్వేగాలకు సంబంధించిన అంశంపై బాబుకు ఇంత చిన్నచూపా?
తమ జాతినే అవమానించడంపై మండిపాటు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. కక్ష సాధింపులో వారినీ టార్గెట్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతోంది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్ కాపు సామాజికవర్గం మండిపడుతోంది. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నరీతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తమను కూరలో కరివేపాకులా తీసిపారేయడం మాత్రమే కాదు.. ఏకంగా అక్రమ కేసులు పెట్టి వేధించే కుట్రకు తెగబడటంపై ఆ సామాజికవర్గంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టివేసినా సరే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వాటిని తిరగదోడాలని నిర్ణయించడం.. పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించడం కాపు సామాజికవర్గాన్ని షాక్‌కు గురి చేసింది. ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తమ ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రస్తుతం అధికారంలోకి రాగానే తన అసలు నైజాన్ని చూపించారని కాపు సామాజికవర్గం దుయ్యబడుతోంది.
కక్ష సాధింపు కోసం చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిన ఈ దుష్ట సంప్రదాయం రాష్ట్ర రాజకీయాలను మరింత కలుషితం చేయడమే కాకుండా రాష్ట్రంలో వర్గ వైషమ్యాలు రేకెత్తించే ప్రమాదం ఉందని కూడా పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మరోసారి గురయ్యామని కాపు సామాజికవర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని చేపడితే 2016లో అక్రమ కేసులు పెట్టి వేధించారు.

ఆ కేసులను న్యాయస్థానాలే తోసిపుచ్చడంతో కాపులకు ఊరట లభించింది. కాగా 2024 ఎన్నికల్లో మరోసారి కాపులను మాయమాటలతో చంద్రబాబు కనికట్టు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 2016 నాటి కేసును తిరగదోడి కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం తెగబడటం గమనార్హం. గతంలో చేసిన మోసానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించామని, ఈసారి చేస్తున్న మోసానికి కూడా అదే రీతిలో శిక్షిస్తామని కాపు సామాజికవర్గం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడతామని... తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు మరోసారి రుచి చూపిస్తామని చెబుతోంది.
హామీని నిలబెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వం
2014 టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమను ఓబీసీల్లో చేర్చాలంటూ కాపులందరూ కూడా 2016 జనవరి 30న తూర్పు గోదావరి జిల్లా, తునిలో ‘కాపు గర్జన’ పేరుతో సభను ఏర్పాటు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ కార్యక్రమంలో వేల మంది కాపులు పాల్గొన్నారు. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొందరు గుర్తు తెలియని విద్రోహులు అందులో చేరి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులు ఆందోళనకారులపై 329 కేసులు నమోదు చేశారు.
పెద్ద సంఖ్యలో కాపులపై కేసులు పెట్టారు. అయితే కాపులు కేసులకు భయపడకుండా ఆ తరువాత కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత కాపు ఉద్యమకారులపై గతంలో పెట్టిన కేసుల్లో అత్యధిక కేసులను ఉపసంహరించుకున్నారు. కొన్ని కేసుల్లో విజయవాడ కోర్టు 2023లో ఉద్యమకారులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
కాపు సామాజికవర్గమే లక్ష్యంగా కుట్ర
ఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో కాపులు 2016లో చేపట్టిన ఆందోళనకారులపై అప్పట్లో కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి ఆ ఉద్యమకారులను జైలు పాల్జేయడానికి కంకణం కట్టుకుంది. కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టినందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో సహా పలువురు కాపులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2016లో కేసులు నమోదు చేసింది. మొత్తం 329 కేసులు పెట్టింది. ఇందులో పలు కేసులను ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించింది. మరికొన్ని కేసులపై విచారణ జరిపిన విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ పద్మనాభంతోపాటు 41 మందిని నిర్ధోషులుగా ప్రకటించింది.
ఆ మేర 2023 మే 1న తీర్పు వెలువరించింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ కేసులను తిరగదోడుతోంది. కాపు ఉద్యమకారులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)కి అనుమతినిచ్చింది. విజయవాడ రైల్వే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ సోమవారం జీవో 852 జారీ చేశారు.
చంద్రబాబు కాపు వ్యతిరేకి
సీఎం చంద్రబాబు కాపు వ్యతిరేకి. కాపులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కోర్టు కొట్టేసిన కేసుపై పునర్విచారణకు వెళ్లాలని చూస్తున్నారు. అన్యాయంగా కాపు జాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు. తగిన గుణపాఠం చెబుతాం.
– చినమిల్లి వెంకటరాయుడు, కాపునాడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు
కాపులను ఇబ్బంది పెడితే సహించం..
గత ప్రభుత్వంలో రైలు దగ్థం కేసులో కాపులపై పెట్టిన కేసులు కొట్టేస్తే.. ఈ ప్రభుత్వం వాటిని తిరగదోడి కాపులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేదిలేదు. రాష్ట్ర ప్రభుత్వం కాపులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాపులపై కేసులు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే సీట్లు తగ్గించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం కాపులపై వివక్ష చూపడం సమంజసం కాదు.
– సంకటి లక్ష్మణరావు, పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు
కేసు తిరగదోడటం మంచి పద్ధతి కాదు..
కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణిస్తున్నాం. రైలు ప్రమాద ఘటన అనేది ముగిసిన అధ్యాయం. తిరిగి ఆ కేసును రీ ఓపెన్ చేయడం బాధాకరం. కాపులమంతా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎప్పుడో జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఇది కాపు జాతి మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తాం.
– బండి శ్రీనివాసరావు, కాపు సామాజికవర్గ ఐక్యవేదిక నాయకుడు, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా
కాపుల జోలికొస్తే సర్కారు పతనమే..
తుని కేసును పునర్విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపుల కారణంగానే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. అది మరిచిపోయి కాపు జాతిపై కక్ష సాధింపునకు పాల్పడితే చంద్రబాబు సర్కారుకు పతనమే.
– తోట రాజీవ్, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్
రంగా కేసును ముందు పునర్విచారణ చేయాలి..
గతంలో కాపులను టీడీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధించింది. కాపులను అణచివేసే ప్రయత్నం చేసింది. అక్రమ కేసులు బనాయించింది. తుని రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టివేసింది. కాపులే లక్ష్యంగా ఆ కేసును పునర్విచారించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి. కాపులను వేధింపులకు గురిచేస్తే సహించేదిలేదు. పాత కేసులు పునర్విచారణ చేయించాలనుకుంటే ముందుగా వంగవీటి మోహన్‌రంగా హత్య కేసును పునర్విచారణ జరపాలి.
– యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం
ఇలాగైతే బలిజలు కూటమిలో ఇమడలేరు..
రెండేళ్ల క్రితం తుని ఘటనపై సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు కొట్టేసిన కేసును ఇప్పుడు తెరపైకి తీసుకురావాల్సిన అవసరంలేదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. బలిజలంతా కూటమిలో ఇమడలేని పరిస్థితులు తలెత్తుతాయి.
– రామమూర్తి, కాపు జేఏసీ రాష్ట్ర సహ కార్యదర్శి, బీజేపీ చిత్తూరు జిల్లా నాయకుడు, చిత్తూరు.