breaking news
kapu community leaders
-
కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం 'కాపులు కరివేపాకులా'?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. కక్ష సాధింపులో వారినీ టార్గెట్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతోంది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్ కాపు సామాజికవర్గం మండిపడుతోంది. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నరీతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తమను కూరలో కరివేపాకులా తీసిపారేయడం మాత్రమే కాదు.. ఏకంగా అక్రమ కేసులు పెట్టి వేధించే కుట్రకు తెగబడటంపై ఆ సామాజికవర్గంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టివేసినా సరే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వాటిని తిరగదోడాలని నిర్ణయించడం.. పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించడం కాపు సామాజికవర్గాన్ని షాక్‌కు గురి చేసింది. ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తమ ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రస్తుతం అధికారంలోకి రాగానే తన అసలు నైజాన్ని చూపించారని కాపు సామాజికవర్గం దుయ్యబడుతోంది. కక్ష సాధింపు కోసం చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిన ఈ దుష్ట సంప్రదాయం రాష్ట్ర రాజకీయాలను మరింత కలుషితం చేయడమే కాకుండా రాష్ట్రంలో వర్గ వైషమ్యాలు రేకెత్తించే ప్రమాదం ఉందని కూడా పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మరోసారి గురయ్యామని కాపు సామాజికవర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని చేపడితే 2016లో అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆ కేసులను న్యాయస్థానాలే తోసిపుచ్చడంతో కాపులకు ఊరట లభించింది. కాగా 2024 ఎన్నికల్లో మరోసారి కాపులను మాయమాటలతో చంద్రబాబు కనికట్టు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 2016 నాటి కేసును తిరగదోడి కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం తెగబడటం గమనార్హం. గతంలో చేసిన మోసానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించామని, ఈసారి చేస్తున్న మోసానికి కూడా అదే రీతిలో శిక్షిస్తామని కాపు సామాజికవర్గం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడతామని... తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు మరోసారి రుచి చూపిస్తామని చెబుతోంది. హామీని నిలబెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వం 2014 టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమను ఓబీసీల్లో చేర్చాలంటూ కాపులందరూ కూడా 2016 జనవరి 30న తూర్పు గోదావరి జిల్లా, తునిలో ‘కాపు గర్జన’ పేరుతో సభను ఏర్పాటు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ కార్యక్రమంలో వేల మంది కాపులు పాల్గొన్నారు. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొందరు గుర్తు తెలియని విద్రోహులు అందులో చేరి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులు ఆందోళనకారులపై 329 కేసులు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో కాపులపై కేసులు పెట్టారు. అయితే కాపులు కేసులకు భయపడకుండా ఆ తరువాత కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత కాపు ఉద్యమకారులపై గతంలో పెట్టిన కేసుల్లో అత్యధిక కేసులను ఉపసంహరించుకున్నారు. కొన్ని కేసుల్లో విజయవాడ కోర్టు 2023లో ఉద్యమకారులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.కాపు సామాజికవర్గమే లక్ష్యంగా కుట్రఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వంరాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో కాపులు 2016లో చేపట్టిన ఆందోళనకారులపై అప్పట్లో కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి ఆ ఉద్యమకారులను జైలు పాల్జేయడానికి కంకణం కట్టుకుంది. కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టినందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో సహా పలువురు కాపులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2016లో కేసులు నమోదు చేసింది. మొత్తం 329 కేసులు పెట్టింది. ఇందులో పలు కేసులను ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించింది. మరికొన్ని కేసులపై విచారణ జరిపిన విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ పద్మనాభంతోపాటు 41 మందిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఆ మేర 2023 మే 1న తీర్పు వెలువరించింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ కేసులను తిరగదోడుతోంది. కాపు ఉద్యమకారులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)కి అనుమతినిచ్చింది. విజయవాడ రైల్వే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ సోమవారం జీవో 852 జారీ చేశారు. చంద్రబాబు కాపు వ్యతిరేకిసీఎం చంద్రబాబు కాపు వ్యతిరేకి. కాపులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కోర్టు కొట్టేసిన కేసుపై పునర్విచారణకు వెళ్లాలని చూస్తున్నారు. అన్యాయంగా కాపు జాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు. తగిన గుణపాఠం చెబుతాం.– చినమిల్లి వెంకటరాయుడు, కాపునాడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుకాపులను ఇబ్బంది పెడితే సహించం..గత ప్రభుత్వంలో రైలు దగ్థం కేసులో కాపులపై పెట్టిన కేసులు కొట్టేస్తే.. ఈ ప్రభుత్వం వాటిని తిరగదోడి కాపులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేదిలేదు. రాష్ట్ర ప్రభుత్వం కాపులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాపులపై కేసులు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే సీట్లు తగ్గించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం కాపులపై వివక్ష చూపడం సమంజసం కాదు. – సంకటి లక్ష్మణరావు, పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులుకేసు తిరగదోడటం మంచి పద్ధతి కాదు..కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణిస్తున్నాం. రైలు ప్రమాద ఘటన అనేది ముగిసిన అధ్యాయం. తిరిగి ఆ కేసును రీ ఓపెన్ చేయడం బాధాకరం. కాపులమంతా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎప్పుడో జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఇది కాపు జాతి మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తాం. – బండి శ్రీనివాసరావు, కాపు సామాజికవర్గ ఐక్యవేదిక నాయకుడు, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా కాపుల జోలికొస్తే సర్కారు పతనమే..తుని కేసును పునర్విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపుల కారణంగానే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. అది మరిచిపోయి కాపు జాతిపై కక్ష సాధింపునకు పాల్పడితే చంద్రబాబు సర్కారుకు పతనమే.– తోట రాజీవ్, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్రంగా కేసును ముందు పునర్విచారణ చేయాలి..గతంలో కాపులను టీడీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధించింది. కాపులను అణచివేసే ప్రయత్నం చేసింది. అక్రమ కేసులు బనాయించింది. తుని రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టివేసింది. కాపులే లక్ష్యంగా ఆ కేసును పునర్విచారించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి. కాపులను వేధింపులకు గురిచేస్తే సహించేదిలేదు. పాత కేసులు పునర్విచారణ చేయించాలనుకుంటే ముందుగా వంగవీటి మోహన్‌రంగా హత్య కేసును పునర్విచారణ జరపాలి.– యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘంఇలాగైతే బలిజలు కూటమిలో ఇమడలేరు..రెండేళ్ల క్రితం తుని ఘటనపై సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు కొట్టేసిన కేసును ఇప్పుడు తెరపైకి తీసుకురావాల్సిన అవసరంలేదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. బలిజలంతా కూటమిలో ఇమడలేని పరిస్థితులు తలెత్తుతాయి. – రామమూర్తి, కాపు జేఏసీ రాష్ట్ర సహ కార్యదర్శి, బీజేపీ చిత్తూరు జిల్లా నాయకుడు, చిత్తూరు. -
పవన్ కళ్యాణ్ తీరుపై రగిలిపోతున్న కాపులు
-
కాపుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులు తెలిపారు. కాపులకు గత మూడేళ్లలో పలు పథకాల ద్వారా రూ.27 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చారని, గ్రామ గ్రామాన దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. త్వరలో విజయవాడలో కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ తమకు పది సీట్లు ఇవ్వాలని ఎవరినో కోరారంటే పార్టీని తాకట్టు పెట్టేందుకే కదా? అని కాపు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. పవన్‌కు ధైర్యం ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తామని ప్రకటించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్సార్సీపీనే వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు. కాపు యువతకు వివరిద్దాం.. అధికారంలో ఉండగా కాపులను అణగదొక్కిన చంద్రబాబుకు తన సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్న పవన్‌కళ్యాణ్ రాజకీయ దిగజారుడుతనాన్ని కాపు ప్రజాప్రతినిధులు తూర్పారబట్టారు. వంగవీటి మోహన్‌రంగా హత్యకు కారకుడైన చంద్రబాబుతో పవన్ అంటకాగటాన్ని తప్పుబట్టారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చేసి వేలాది మంది కాపులపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేసిన చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కాపు యువతకు అర్థమయ్యేలా వివరించాలని తీర్మానించారు. ఇటీవల కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన వ్యాఖ్యలను సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎంపీలు వంగా గీత, బాలశౌరి, బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, గెడ్డం శ్రీనివాసనాయుడు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, సామినేని ఉదయభాను, కిలారి వెంకట రోశయ్య, ఆరాని శ్రీనివాసులు, బొత్స అప్పల నరసయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా నాగశేషు తదితరులు పాల్గొన్నారు. భేటీలో చర్చించిన అంశాలను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. పవన్ కుమ్మక్కు రాజకీయాలు: కొట్టు టీడీపీ కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో రూ.1,824 కోట్లు మాత్రమే విదిల్చింది. ముఖ్యమంత్రి జగన్ కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ ఇప్పటిదాకా డీబీటీ ద్వారా రూ.16,485 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.10 వేల కోట్లతో మొత్తం రూ.27 వేల కోట్లు కాపులకు అందచేశారు. 70,83,377 మంది కాపులకు సాయం చేశారు. టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కుమ్మక్కై కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. చెప్పులు చూపిస్తూ అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు. విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. రంగాకు రక్షణ కల్పించని టీడీపీ సర్కారు:దాడిశెట్టి రాజా, మంత్రి శాసనసభ సాక్షిగా తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని నాడు వంగవీటి రంగా కోరితే టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. నాడు మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య రంగా హత్యపై రాసిన పుస్తకాన్ని పవన్ చదవలేదా? కాపుల్లో ఉద్వేగాన్ని రగిల్చే కుట్ర: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి టీడీపీ హయాంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా చూపించాలనుకున్న చంద్రబాబు పాలనలో కాపులపై కేసులు పెట్టడమే కాకుండా వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టారు. విశాఖలో సెక్షన్ 30 ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు ఆయన అధికారంలో ఉండగా రాజమహేంద్రవరంలో మూడేళ్ల పాటు సెక్షన్ 30 అమలు చేసిన విషయం గుర్తు లేదా? రంగా హత్య కుట్రను వక్రీకరించి కాపుల్లో ఉద్వేగాన్ని రేపాలని కుట్రలు పన్నుతున్నారు. కాపులకు చంద్రబాబు కంటే సీఎం జగన్ లక్ష రెట్లు మేలు చేస్తున్నారన్నారు. సీఎం దృష్టికి తెస్తాం: మంత్రి బొత్స వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే టికెట్ల నుంచి మంత్రులు, నామినేటెడ్ పదవుల వరకు ముఖ్యమంత్రి జగన్ కాపులకు పెద్దపీట వేశారు. కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలతోపాటు కాపులకు సమాన ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. భేటీలో చర్చించిన అంశాలను క్రోడీకరించి కార్యాచరణతో సీఎం దృష్టికి తెస్తాం. ఇటీవల ఓ సెలబ్రిటీ పార్టీ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతోంది. కాపు రిజర్వేషన్లపై ఆది నుంచి ప్రభుత్వం ఒకే విధానంతో ఉంది. వాస్తవాలను వక్రీకరించి అపోహలు కల్పించడం లేదు. రాజ్యాంగపరంగా ఎంతవరకు చేయగలమో అది చేస్తాం. కేంద్రం ఈడబ్లు్యఎస్‌కు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో రాష్ట్రానికి సౌలభ్యం కల్పిస్తే అత్యధికంగా 25 శాతానికి పైబడి ఉన్న కాపులకు మేలు చేయవచ్చు. గంటలోనే బాబును కలసిన పవన్: మంత్రి అంబటి రాంబాబు టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ. అధికారంలో ఉండగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని అణచివేసి ఆయన కుటుంబ సభ్యులను వేధించింది. కాపులను గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ. కాపు సామాజిక వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, మేయర్లు పార్టీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు సర్కారు బనాయించిన అక్రమ కేసులను సీఎం జగన్ ఎత్తివేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, కాపు ప్రజా ప్రతినిధులను దూషించిన విధానం గర్హనీయం. ఆయన రాజకీయాలకు అనర్హుడు. రంగా హత్య జరుగుతుందని తెలిసినప్పుడు ప్రతి గ్రామం నుంచి కాపులు వెళ్లి ఎందుకు కాపలా కాయలేదని ప్రశ్నించిన పవన్ అనంతరం గంటలోనే దీనికి కారకుడైన చంద్రబాబును కలవడం ఎంత వరకు సమంజసం? 3 తీర్మానాలకు ఆమోదం 1) జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అన్ని నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాపు నేతలను ఆహ్వానించి కాపు సంక్షేమ రోడ్ మ్యాప్ రూపొందించేలా భారీ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం. 2) కాపుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆమోదం. 3) సీనియర్ కాపు నేతలతో చర్చించి కాపుల సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం. -
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కాపుసేన
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని రాష్ట్ర కాపుసేన గౌరవ అధ్యక్షుడు బండారు నారాయణమూర్తి, అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి లంకా భాస్కరరావు, గంట్ల శ్రీనుబాబు తెలిపారు. వారు విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఇప్పటివరకు ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలని ఏ పార్టీ భావించలేదన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మా ప్రాంతానికి రాజధాని రావడం ఆనందంగా ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏర్పాటయితే ముంబాయిని మించి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిపాలనా రాజాధాని ఏర్పాటయితే సినీ పరిశ్రమ విశాఖకు రావడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని.. కాపుసేన తరపున ఆయనకు అభినందనలు తెలిపారు. -
‘చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించి సాగనంపాలి’
సాక్షి, పశ్చిమగోదావరి : కాపు సంక్షేమానికి వెయ్యి కోట్లు ఇస్తామని నమ్మించి.. ఏనాడు కాపుజాతిని పిలిచి దీనిపై చర్చింలేదని.. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని నిలువునా ముంచిన చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించి సాగనంపాలని జిల్లా కాపు సంఘం అధ్యక్షులు చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చాలని ఏనాడూ మేము అడగలేదని కాపులకు కల్పించాల్సిన సౌకర్యాలు మాత్రమే అడిగామని తెలిపారు. 2014 ఎన్నికల్లో 600హామీలను ఇచ్చిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు, ప్రజలు ముఖ్యంగా కాపు మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. -
జగన్‌ను సత్కరించిన కాపు నేతలు
పిఠాపురం: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేబ్రోలులో రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కాపు నేతలు సత్కరించారు. నాయకులు కొండేపూడి సురేష్,మాగాపు అమ్మిరాజు, గాదంశెట్టి శ్రీధర్, తోట భద్రరావు, తవట్టికూటి ఏసురావు తదితరులు మాట్లాడుతూ మొదటి నుంచి కాపుల ఉద్యమానికి అండగా ఉన్న నేత ఒక్క ఈయనే అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చి మోసం చేసిన వారిని కాపులు చూస్తు ఊరుకోరని వారు హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు కాపు నేతలు యుయకులు పాల్గొన్నారు. జగన్‌ను కలిసిన కాపు నేతలు -
'మాటతప్పితే గద్దె దింపుతాం'
కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ సాధన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గద్దె దించేందుకు కాపు జాతి వెనుకాడబోదని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో అక్రమంగా ఎవరిని అరెస్టు చేసినా, వారికి మద్దతుగా యావత్ కాపు జాతి స్వచ్ఛందంగా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆదివారం ఆయన పలు జిల్లాల కాపు ముఖ్య నాయకులతో పాటు, ఐక్యగర్జనలో కేసులు నమోదైన వారితో సమావేశమయ్యారు. కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొంత మంది కాపులపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. కాపులను విభజించి పాలించడంతో పాటు కాపు జాతి నాయకులతో చంద్రబాబు ఎదురు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జాతిలోని నిరుపేదల కోసం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు తన పోరాటం ఆగదన్నారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలవల్లే ఇపుడు రోడ్డెక్కి ఉద్యమం చేయాల్సి వస్తోందన్నారు. హామీలు అమలు చేయక పోవడంతో ఉద్యమం తర్వాత దీక్ష చేపట్టానని చెప్పారు. గడువులోగా కమిషన్ రిపోర్టు తెప్పించుకుని బీసీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని 9వ షెడ్యూల్లో చేర్చే నిమిత్తం కేంద్రానికి పంపించడానికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేదంటే ఆయన్ను కుర్చీ నుంచి దించుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ జిల్లాల కాపు నాయకులు పాల్గొన్నారు. -
వంగవీటి ఆశయాలు కొనసాగిద్దాం
ఒంగోలు సబర్బన్ : బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం వంగవీటి మోహన రంగా కృషి చేశారని కాపు సంఘం నాయకులు కీర్తించారు. స్థానిక ఒంగోలులోని రామ్‌నగర్ 1వ లైనులో శనివారం రంగా 68వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ రంగా పేద వర్గాల కోసం చేసిన కృషి మరువలేనిదన్నారు. రంగా ఆశయాలను కొనసాగించాలని.. కాపుల ఐక్యతకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు వారి సంక్షేమం కోసం ఏడాదికి రూ. 1000 కోట్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. హక్కుల సాధనకై గుంటూరులో కాపు నాయకుడు నల్లట విజయరాజునాయుడు శనివారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని, ఆయనకు సంఘీభావం తెలపాలన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ బేతంశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ రంగా ఎదుగుదలను ఓర్చుకోలేని దుండగులు అతనిని అంతమొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాకిరి ధనుంజయ్ మాట్లాడుతూ అటువంటి మహానాయకుడు మళ్లీ పుట్టరన్నారు. నాయకులు తోట శ్రీహరినాయుడు, పసుపులేటి శేషగిరి, నంద్యాల శ్రీనివాసరావు, కాపు కమ్యూనిటీ హాలు అధ్యక్ష, కార్యదర్శులు గాదె వెంకటకృష్ణారావు, ఆరిగ చలమయ్య, కోశాధికారి తోటపల్లి వెంకటరంగారావు, చింతం సుబ్బారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, కుర్రా ప్రసాద్, తోటకూర రామారావు, మంగిశెట్టి కోటేశ్వరరావు, మద్దుల నరసింహారావు, వెలనాటి మాధవరావు, ఓగిరాల రాధాకృష్ణమూర్తి, పసుపులేటి శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, మారెళ్ల శ్రీనివాసరావు, ఉన్నంశెట్టి శ్రీనివాసరావు, చంగలశెట్టి శ్రీనివాసరావు, తోట జాలబాబు, పోకల సత్యం, మన్నెం చక్రవర్తి నివాళులర్పించారు. -
'కాపుల బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి'
హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాపు సంఘం నేతలు కలిశారు. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కాపు వర్గాలన్నీ కాంగ్రెస్ కు దూరమవుతాయన్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిన విషయాన్ని బొత్స కూడా అంగీకరించారు. అందుకు కాపు సంఘం నేతలకు బొత్స క్షమాపణలు తెలిపారు.ఈ నెల 10 లోగా సీఎం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామి ఇచ్చారు.