‘సిట్‌’ లక్ష్యం... తప్పుడు సాక్ష్యం! | Chandrababu Govt Conspiracy on file an case on YSRCP govt liquor policy: AP | Sakshi
Sakshi News home page

‘సిట్‌’ లక్ష్యం... తప్పుడు సాక్ష్యం!

Apr 15 2025 3:56 AM | Updated on Apr 15 2025 3:56 AM

Chandrababu Govt Conspiracy on file an case on YSRCP govt liquor policy: AP

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసుకు చంద్రబాబు సర్కారు కుట్ర 

అందుకే హైదరాబాద్‌లో ఆకస్మిక తనిఖీలు?

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం... ప్రస్తుతం దొంగ సాక్ష్యాలను సృష్టించే పనిలో పడింది. అందుకోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను రంగంలోకి దించింది.

సిట్‌ సోమ­వారం కార్యాచరణకు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి నివాసం (హైదరాబాద్‌), ఇతర ప్రాంతాల్లో తనిఖీల పేరిట హడావుడి చేసింది.   

అసహనంతో రగిలిపోతున్న ప్రభుత్వ పెద్దలు 
రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులు పెట్టి నేతలను వేధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నిన విషయం తెలిసిందే. సీఐడీ కొన్ని నెలలపాటు దర్యాప్తు చేసినా ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. అసలు లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దాంతో చంద్రబాబు ప్రభుత్వం సీఐడీని పక్కనపెట్టి... తమ వీరవిధేయ అధికారులను సిట్‌ పేరుతో రంగంలోకి దించింది. 

అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని సిట్‌ అధికారులు గతంలో పని చేసిన ప్రభుత్వ అధికారులు, బేవరేజస్‌ కంపెనీల ప్రతినిధులను వేధించారు. సిట్‌ వేధింపులను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇంత రాద్ధాంతం చేసినా ఈ కేసులో సిట్‌కు సైతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించకపోవడంతో ప్రభుత్వ పెద్దలు అసహనంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతను సంతృప్తి పరిచేందుకు సిట్‌ అధికారులు కొత్త కుట్రకు తెగించారు.  

తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించే కుతంత్రం...
సిట్‌ అధికారులు తీవ్రస్థాయిలో వేధించి రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్‌ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. కానీ, వాటిని బలపరిచే సాక్ష్యాలు ఏమీ లేకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగదని గుర్తించారు. ఈ క్రమంలో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్‌ మరో ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు పన్నాగం పన్నింది.

దానిలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి నివాసంతోపాటు పలు కార్యాలయాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. సిట్‌ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్‌డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్‌ డిస్‌్కలలో స్టోర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆ పెన్‌డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్‌ డిస్క్‌లను తమవెంట తీసుకువెళ్లి... తనిఖీలు నిర్వహించిన నివాసాలు, కార్యాలయాల్లో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాలన్నది సిట్‌ పన్నాగం.

తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలన్నది సీఐడీ కుతంత్రం. అందుకు తొలి అడుగుగానే సిట్‌ అధికారులు హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి నివాసంతోపాటు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి కుట్రలు ఇంకా పెరుగుతాయని చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement