
అధికార యంత్రాంగంపై పెనుభారం మోపిన కూటమి ప్రభుత్వం
పీ–4 కింద పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో టార్గెట్లు
ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగిపైనా భారం! మార్గదర్శకులను వెదకాలని ఆదేశాలు
తహసీల్దార్‌కు 200 మంది, డివిజన్ అధికారులకు 2 వేల టార్గెట్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఐదుగురు మార్గదర్శులను తేవాలి
ఎవరూ లేకపోతే మీరే కొందరిని దత్తత తీసుకోవాలని ఒత్తిడి
క్షేత్రస్థాయిలో దత్తత తీసుకునేందుకు ముందుకురాని ధనికులు
అయినా మార్గదర్శులను చూడాలంటూ నిత్యం కాన్ఫరెన్సులు
ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార యంత్రాంగం
పీ–4 దెబ్బకు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన
‘పీ–4 కింద పేదలను దత్తత తీసుకోవడానికి మార్గదర్శులను తీసుకురండి... లేకపోతే మీరే దత్తత తీసుకుని మార్గదర్శిగా మారండి. ఎవరిని దత్తత తీసుకుంటున్నారో వెంటనే చెప్పాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆ వివరాలు ఇవ్వండి’ – అధికార యంత్రాంగానికి ఓ జిల్లా కలెక్టర్ అల్టీమేటం
‘‘మార్గదర్శులు దొరకలేదని చెప్పొద్దు. అసలు ముందు మీరు ఎంతమందిని దత్తత తీసుకుంటున్నారో చెప్పాలి’’ –తహసీల్దార్లు, ఇతర అధికారులతో ఏలూరు డీఆర్‌వో
ఏం చేస్తావో తెలియదు.. నువ్వే దత్తత తీసుకో...! –కర్నూలులోని వార్డు సచివాలయ ఉద్యోగినికి ఉన్నతాధికారి హుకుం
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జీరో పావర్టీ పీ–4 కార్యక్రమం అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఎంతటి గుదిబండగా మారిందో ఈ ఉదంతం చెబుతోంది. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా ధనికులను గుర్తించి వారితో పేదలను దత్తత తీసుకునేలా చేయాలనే కాన్సెప్ట్ పూర్తిగా విఫలమవడంతో ఆ భారం అంతా అధికార యంత్రాంగంపై పడుతోంది. తాను ఇచ్చిన పిలుపుతో ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ధనికులు ఎగబడి వచ్చి పేదలను దత్తత తీసుకుంటారని భావించిన చంద్రబాబుకు ఆచరణలో అదంత సులువు కాదని తెలిసింది. అయినాసరే ఎలాగైన పీ–4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అధికార యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. ఆ భారమంతా అధికారులు, ఉద్యోగులపై పెడుతున్నారు.
గంటగంటకు ప్రోగ్రెస్..!
ప్రతి జిల్లాలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు.. ఇలా ఎవరినీ వదలకుండా గంటగంటకు పీ–4 ప్రోగ్రెస్ అడుగుతుండడంతో వారు బెంబేలెత్తుతున్నారు. మార్గదర్శులుగా ఎవరూ రాకపోవడంతో మీరే కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు రోజూ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అన్ని శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.
⇒ డివిజన్, మండల, గ్రామస్థాయి వరకు నివేదికలు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. రోజూ కొంత ప్రోగ్రెస్ ఉండాలని చెబుతుండడంతో అధికారులు, ఉద్యోగులు
అల్లాడిపోతున్నారు.
⇒ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లపై మార్గదర్శుల కోసం విపరీతమైన ఒత్తిడి ఉండడంతో వారు అధికార యంత్రాంగంపై భారం మోపి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
సచివాలయ ఉద్యోగికి నలుగురు.. టీచర్‌కు ఇద్దరు టార్గెట్
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగికి నలుగురు మార్గదర్శులను తెచ్చేలా టార్గెట్ ఇచ్చారు. ఇందుకోసం సచివాలయ ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంకు నలుగురు, ఉపాధ్యాయుడికి ఇద్దరు మార్గదర్శులను తీసుకొచ్చే టార్గెట్ ఇచ్చారు. ప్రతి తహసీల్దార్‌కు 200 మంది, ఎంపీడీవోకు 200 మంది, జిల్లా స్థాయి అధికారులకు వెయ్యి నుంచి 2 వేల మందిని టార్గెట్ ఇచ్చారు. దీంతో చేసేదేం లేక వారు తమ కింద సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. ఎవరూ దొరక్కపోతే.. తమకుటుంబాలు, స్నేహితుల్లో ఆరి్థకంగా పర్వాలేదనుకున్న వారి కాళ్లావేళ్లాపడి మార్గదర్శులు కావాలని వేడుకుంటున్నారు.
⇒ కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం టార్గెట్ ఇచ్చి మార్గదర్శులను తేవాలని లేకపోతే మీరే మార్గదర్శుల వ్వాలని చెబుతుండడం గమనార్హం.
ప్రభుత్వ బాధ్యతను మాపై మోపితే ఎలా?
సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు... దానిని కప్పిపుచ్చుతూ ‘‘పూర్ టు రిచ్’’ అనే పేరుతో పేదలను ధనికులు దత్తత తీసుకోవాలంటూ పీ–4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ భారమంతా అధికార యంత్రాంగంపై నెట్టేశారు. దత్తత పొందే పేదలను బంగారు కుటుంబాలని, దత్తత తీసుకునేవారిని మార్గదర్శులని పేరు పెట్టారు. రాష్ట్రంలో 20 లక్షల బంగారు కుటుంబాలు (పేద కుటుంబాలు) ఉన్నాయని సర్వే ద్వారా గుర్తించారు. మార్గదర్శులు ... బంగారు కుటుంబాలకు ఆర్థిక అండదండలు ఇవ్వడం, విద్య, వైద్యం వంటివాటి ఖర్చు భరించడం, ఇంకా ఏమైనా సమస్యలుంటే తీర్చి ఏడాదిలో తమ స్థాయికి తీసుకురావాలనే లక్ష్యం విధించారు.
భారీఎత్తున ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకురావాలని చంద్రబాబు పదేపదే కోరినా పెద్దగా స్పందన లేదు. చివరికి తాను కుప్పంలోని 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించినా పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐల నుంచి పరిస్థితి అంతే. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఆ భారం మోపారు. పేదరిక నిర్మూలన ప్రభుత్వ బాధ్యత.. అందుకు ఒక స్పష్టమైన విధానం ఉండాలే తప్ప తమపై పడడం ఏమిటని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 5.82 లక్షల పేద కుటుంబాలను 53,434 మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇంకా 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. ఎవరూ రాకపోవడంతో ఆ భారమంతా అధికారులు, ఉద్యోగులపై పడింది. దీంతో వారు ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అలవికాని హామీ ఇచ్చిన చంద్రబాబు తమ కొంప ముంచుతున్నారని వాపోతున్నారు. తామే ఆరి్థక ఇబ్బందులతో సతమతం అవుతుంటే తమను వేరే కుటుంబాలను దత్తత తీసుకోమనడం ఏమిటని వాపోతున్నారు. దత్తత తీసుకుంటే సరిపోదని వారి అవసరాలన్నీ తీర్చాలని రిజిస్ట్రేషన్ సమయంలో చెబుతూ డిక్లరేషన్ తీసుకుంటుండడంతో ఉద్యోగులు నెత్తినోరు బాదుకుంటున్నారు.
ఆదివారమైనా ప్రోగ్రెస్ చూపించాల్సిందే!
ఏలూరు డీఆర్‌వో.. తహసీల్దార్లు, ఇతర అధికారులకు టెలీకాన్ఫరెన్స్ పెట్టి ఆదివారమైనా మార్గదర్శుల టార్గెట్ గురించి ఆరా తీశారు. అందరూ లక్ష్యం చేరుకోవాలని, కాసేపటి తర్వాత కలెక్టర్‌కు ప్రోగ్రెస్ చూపించాలని చెప్పడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
⇒ కర్నూలులో వార్డు సచివాలయ ఉద్యోగినికి నలుగురు మార్గదర్శుల టార్గెట్ పెట్టారు. వ్యాపారులు, ధనవంతులను సంప్రదించినా ఎవరూ ముందుకురాలేదు. విషయాన్ని అధికారులకు చెబితే ఆమెకు చీవాట్లు పెట్టారు. నువ్వు దత్తత తీసుకో అన్నారు. ‘నా జీతంతో మా కుటుంబాన్ని గడపడమే కష్టంగా ఉంది. ఇంకొక కుటుంబాన్ని ఎలా పోషించగలం?‘ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
⇒ గుంటూరులోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇద్దరు మార్గదర్శులను తీసుకురావాలని లక్ష్యం ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వ్యాపారులను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం రాలేదు. పాఠాలు వదిలేసి.. ఇలాంటి పనులు చెబితే ఏం చేయాలని ఆయన వాపోతున్నారు.