AP: గురి తప్పని చదువులకు.. ఏకలవ్య

Centre Sanctions Nine More Ekalavya Model Residential Schools To AP - Sakshi

గిరిజన బిడ్డల నాణ్యమైన చదువులకు రాష్ట్రంలో ఇప్పటికే 19 ఏకలవ్య గురుకుల స్కూళ్లు

కొత్తగా మరో 9 పాఠశాలలను మంజూరు చేసిన కేంద్రం

విశాఖపట్నం, తూర్పుగోదావరి ఏజెన్సీలో ఏర్పాటు 

15 నుంచి 20 ఎకరాల్లో ఒక్కో పాఠశాల నిర్మాణం

6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధన

సమస్త ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్య

ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ నిష్ణాతులను చేస్తున్న వైనం

సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఒక్క చదువులోనే కాకుండా ఆటలు, సాంస్కృతిక అంశాల్లోనూ వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు వేసింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను కూడా అందిపుచ్చుకుంటూ గిరిజనుల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది.

ఏకలవ్య స్కూళ్ల ద్వారా ప్రతి విద్యార్థిని చదువుల్లో గురి తప్పని ఏకలవ్యులుగా తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు మేలైన ఫలితాలు సాధిస్తుండగా ఏకలవ్య పాఠశాలలు మరింతగా ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉండగా కొత్తగా మరో 9 మంజూరయ్యాయి. 2021–2022 విద్యా సంవత్సరానికి మంజూరైన వీటిని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.

ఏకలవ్య పాఠశాలల ప్రత్యేకతలు ఇవే.. 
సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు ఉంటాయి. మొదటి ఏడాది ఆరో తరగతితో ప్రారంభించి ఆ తర్వాత ఏడాదికొక తరగతి చొప్పున 12వ తరగతి వరకు పెంచుతారు.  
ప్రతి తరగతికి 60 మంది (బాలలు 30, బాలికలు 30 మంది) ఉంటారు. 11, 12 తరగతుల్లో 90 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. 
ఒక్కో పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 ఎకరాల స్థలంలో నిర్మిస్తుంది.  
విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలం ఇలా సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 8 బాలబాలికల కోసం వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల ఉంటాయి. 8 ఇండోర్‌ స్టేడియం, అవుట్‌డోర్‌ ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు ద్వారా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
 

వేగంగా ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు వేగంగా సాగుతోంది. కేంద్రం కొత్తగా రాష్ట్రానికి 9 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. వీటి నిర్మాణం వేగంగా సాగేలా ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు 15 నుంచి 20 ఎకరాల చొప్పున ఉచితంగా భూమిని కేటాయించింది. వీటికి ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.1.09 లక్షలు చొప్పున కేటాయిస్తుంది. కాగా ఏకలవ్య పాఠశాలలకు ఉచితంగా భూమి కేటాయింపు, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్‌ సదుపాయం వంటివి రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తోంది. తద్వారా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తోంది. 
– కె.శ్రీకాంత్‌ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top