ప్ర‌జ‌లకు వైద్యం అందించ‌డంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు | Sakshi
Sakshi News home page

ప్ర‌జ‌లకు వైద్యం అందించ‌డంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు

Published Fri, Jul 14 2023 9:26 PM

Centre praises On AP Health services At Swasthya Chintan Shivir in Dehradun - Sakshi

డెహ్రడూన్‌: ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డంలో దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముందువ‌రుస‌లో ఉంద‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌శంస‌లు కురిపించింది. ఉత్త‌రాఖండ్ రాష్ట్ర రాజ‌ధాని డెహ్ర‌డూన్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర స‌మాఖ్య 15వ కాన్ఫ‌రెన్స్‌ను స్వాస్థ్య చింత‌న్ శివిర్ పేరుతో నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ‌, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర స‌హాయ మంత్రులు భార‌తీప్ర‌వీణ్ ప‌వార్‌, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్య‌మంత్రి ప్రేమ్‌సింగ్ త‌మాంగ్త‌, 15 రాష్ట్రాల‌కు చెందిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రులు పాల్గొన్నారు.

ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌న దేశంలో ఆయా రాష్ట్రాలు అనుస‌రిస్తున్న వైద్య విధాన‌రాలు, కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, వైద్య విధానాల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చింది. ఈ ప్ర‌జంటేష‌న్‌లో ఏపీ ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించింది. ప‌లు అంశాల్లో ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు చాలా బాగున్నాయ‌ని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమ‌లు చేసేలా అక్క‌డి ప్ర‌భుత్వ విధానాలు ఉన్నాయ‌ని చెప్పింది.
చదవండి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్‌

ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి 2వేల‌కు పైగా ఆస్ప‌త్రులు అత్య‌ద్భుతం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అమ‌ల‌వుతున్న ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో ఏకంగా రెండువేల‌కుపైగా ఆస్ప‌త్రులు అనుసంధాన‌మై ఉన్నాయ‌ని, దేశంలోనే ఈ స్థాయిలో ఆస్ప‌త్రుల్లో ఉచిత వైద్య ప‌థ‌కాలు ఎక్క‌డా అమ‌ల‌వ‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జంటేష‌న్ సంద‌ర్భంగా తెలిపారు. ఏపీ ఆరోగ్య‌శ్రీ అమ‌లు విష‌యంలో చురుగ్గా ఉండ‌టం వ‌ల్ల ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం కూడా చాలా ఎక్కువ ఆస్ప‌త్రుల్లో అమ‌ల‌వుతోంద‌న్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. ఏపీలో ఈ స్థాయిలో ఎలా సాధ్య‌మైందో మిగిలిన రాష్ట్రాలు ప‌రిశీల‌స్తే బాగుంటుంద‌ని సూచ‌న చేశారు.

ఏపీ మొత్తం జ‌నాభా 5 కోట్ల వ‌ర‌కు ఉంటే.. వీరిలో ఏకంగా 80 శాతం మందికి దాదాపు నాలుగున్న‌ర కోట్ల మందికి అబా ఐడీల‌ను ఏపీ ప్ర‌భుత్వం జారీ చేయ‌గ‌లిగింద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం చూపుతున్న చొర‌వ‌ను మిగిలిన రాష్ట్రాలు కూడా గుర్తించాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వ విధానాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ స్పంద‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏపీ రాష్ట్ర చొర‌వ‌కు కేంద్ర స‌హ‌కారం కూడా మ‌రింత‌గా తోడైతే పేద‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement