
విశాఖ స్టీలు ప్లాంట్‌పై మారని కేంద్రం వైఖరి
పెట్టుబడుల ఉపసంహరణ... ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదు
ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశ్నకు ‘దీపం’ సమాధానం
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం యథాతథం
ప్యాకేజీ తమ ఘనతంటూ కూటమి పార్టీల సంబరాలు
పెండింగ్ జీతాలకూ సరిపోని ప్యాకేజీ డబ్బులు.. ప్రైవేటీకరణను పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ కార్మిక సంఘాల డిమాండ్
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం వినిపిస్తున్న వైఎస్సార్‌సీపీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది! ఇప్పటికీ తాము గతంలో ప్రకటించిన విధంగా పెట్టుబడుల ఉపసంహరణ... ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) కార్యదర్శి అజయ్ నాగ్‌పాల్ స్పష్టంగా వెల్లడించారు.
విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమైనా మారిందా? తెలియ చేయాలంటూ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్‌రావు ఈ నెల 2వతేదీన దాఖలు చేసిన దరఖాస్తుపై స్పందిస్తూ లేఖ పంపారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదని ఈ నెల 18వతేదీన రాసిన లేఖలో స్పష్టం చేశారు.
తద్వారా విశాఖ స్టీలు ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తాత్కాలికమేనని.. అది ఉద్యోగుల పెండింగ్ జీతభత్యాలు, స్వచ్చంద పదవీ విరమణల కోసమేనని తేలిపోతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ అటు కార్మిక సంఘాలు, ఇటు వైఎస్సార్‌సీపీ గట్టిగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
ప్యాకేజీ ప్రకటించగానే కూటమి పార్టీల సంబరాలు..
స్టీలు ప్లాంటుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన వెంటనే టీడీపీ కూటమి నేతలు పోటీపడి సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చంద్రబాబు ఘనత అంటూ టీడీపీ టపాసులు కాల్చగా.. అంతా పవన్ వల్లేనంటూ జనసేన ఢంకా మోగించింది. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకోగా ప్యాకేజీతో వేల కుటుంబాల్లో కొత్త ఆశ చిగురించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అయితే స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదని ప్యాకేజీ ప్రకటించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 1,150 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అమలుతోపాటు 3,500 మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పోరాడుతున్న కార్మిక సంఘాలను అణచివేసేందుకు షోకాజ్ నోటీసుల జారీ లాంటి చర్యల ద్వారా ప్రైవేటీకరణ వైపే కూటమి పార్టీలు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ లిఖితపూర్వకంగా తన అభిప్రాయం మారలేదని అధికారికంగా వెల్లడించింది.
దీనిపై కూటమి పార్టీల నేతలు కిమ్మనడం లేదు. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడంతో పాటు బొగ్గు గనులున్న సెయిల్‌లో విలీనం చేయడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్మికులు, కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేస్తున్నామన్న ప్రకటన కేంద్రం నుంచి వచ్చే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ వస్తున్నాయి.
కార్మిక నేతలకు బెదిరింపులు..!
ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఉక్కు ఉద్యోగులకు ఇంకా రెండు నెలల జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్లాంటు తేరుకోగానే ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కార్మికుల గొంతు నొక్కేందుకు పోరాట కమిటీ నేత అయోధ్యరామ్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసులను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సంఘాలు, వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు స్పందించలేదు.
వీఆర్‌ఎస్, తొలగింపుల పర్వం..
స్టీలు ప్లాంటులో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్), కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 1,050 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ పొందేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రెండో దఫా వీఆర్‌ఎస్‌కు కూడా యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంట్రాక్టు కార్మికులను ఇష్టారాజ్యంగా తొలగిస్తూ ఇప్పటికే 364 మందిపై వేటు వేశారు. మొత్తం 3,500 మంది కాంట్రాక్టు కార్మికులపై కత్తి వేలాడుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకే కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది.
వైఎస్సార్ సీపీ దీర్ఘకాలిక పోరాటం
విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ మొదటి నుంచి ఒకే విధానాన్ని అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ప్రైవేటీకరణపై కేంద్రం అడుగు ముందుకు వేయలేకపోయింది.
మోసం చేస్తున్నారు...
స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానిక ప్రజలను కొంతకాలంగా రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. ప్రైవేటీకరణ ఆగడం లేదని మేం చెబుతూనే ఉన్నాం. 2021లో ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోలేదు. అది వెనక్కి తీసుకోనంత వరకూ ప్రైవేటీకరణ కత్తి విశాఖ స్టీలుపై వేలాడుతూనే ఉంటుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నాకు ఇచ్చిన సమాచారంతో ఇది నిజమని తేలిపోయింది. విశాఖ స్టీలు ప్లాంటుపై ఉక్కు శాఖ మంత్రి నుంచి అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. 2021లో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుని, స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలి. – పాడి త్రినాథరావు, జనరల్ సెక్రటరీ, విశాఖ స్టీలు ఎంప్లాయిస్ యూనియన్ (కేంద్ర నుంచి సమాచారం కోరిన దరఖాస్తుదారుడు)
ఉపసంహరించుకోవాల్సిందే...
స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చాం... ప్రైవేటీకరణ కొనసాగుతుందంటే కుదరదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ప్లాంట్ పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలి. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకునేలా కేంద్రంపై టీడీపీ కూటమి సర్కారు ఒత్తిడి తేవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షులు, స్టీల్ సీఐటీయూ
నైజం బయటపడింది...
‘దీపం’ ప్రకటన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కూటమి పార్టీల నైజం బయటపడింది. ప్రజలను మభ్యపెట్టడానికి ప్యాకేజీ అంటూ ప్రకటనలు చేశారు. ప్లాంట్‌కు, ఉద్యోగులకు పనికిరాని ఆ ప్యాకేజీ ఎవరికి ఉపయోగం? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేవరకు పోరాటం కొనసాగిస్తాం. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్‌టీయూసీ