పంచాయతీరాజ్‌కు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌కు గ్రహణం

Feb 22 2026 6:56 AM | Updated on Feb 22 2026 6:56 AM

పంచాయతీరాజ్‌కు గ్రహణం

పంచాయతీరాజ్‌కు గ్రహణం

ఇంజనీరింగ్‌ అధికారుల నియామకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఎస్‌ఈ నుంచి ఈఈల వరకు అందరూ ఇన్‌చార్జిలే పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌ ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం

మహారాణిపేట: గ్రామీణాభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరింగ్‌ అధికారుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ) స్థాయి వరకు అధిక పోస్టులు ఇన్‌చార్జిలతోనే నడుస్తుండటం వల్ల అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. నిధుల కొరతతో పాటు సిబ్బంది లోపం శాఖ పనితీరును ప్రభావితం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎస్‌ఈ పోస్టు ఖాళీ.. ఇన్‌చార్జి పాలన

ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీరాజ్‌ సర్కిల్‌ పరిధిలో ఐదు ఈఈ కార్యాలయాలు ఉన్నాయి. ఎస్‌ఈ సంపత్‌కుమార్‌ జనవరి 31న పదవీ విరమణ చేసిన తర్వాత ఇప్పటివరకు రెగ్యులర్‌ నియామకం జరగలేదు. విజయనగరం ఎస్‌ఈ ఎం. శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు పనిచేసిన సీహెచ్‌ శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్లలో ఈఈ పోస్టులు కూడా ఇన్‌చార్జిలతోనే నడుస్తున్నాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (డీఈఈలు) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), డీఈఈ స్థాయిలో కూడా ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఒకరికి రెండు, మూడు బాధ్యతలు ఉండటంతో పర్యవేక్షణలో లోపాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రభావం స్పష్టమే..

ఇంజినీరింగ్‌ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పనుల నాణ్యత, పర్యవేక్షణ దెబ్బతింటోందని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల నష్టాల నివేదిక సమర్పణలో కూడా జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. చోడవరం, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డివిజన్లలో కీలక పదవులు భర్తీ చేయకపోవడం పంచాయతీరాజ్‌ శాఖ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గ్రామీణాభివృద్ధి వేగం పెంచాలంటే ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రాజెక్టులు నత్తనడక

గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పలు పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన్‌ మంత్రి గ్రామ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) మొదటి దశలో చేపట్టిన కొన్ని రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. 2024–25లో సుమారు 600 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.1.95 కోట్లతో పనులు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో ముగియలేదు. పీఎంజీఎస్‌వై మూడో దశలో 18.40 కిలోమీటర్ల పొడవున రెండు పనులకు రూ.7.30 కోట్ల అంచనా వ్యయం కేటాయించగా, అవి కూడా వివిధ దశల్లోనే ఉన్నాయి. ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కింద 27 పనులు, 158.73 కిలోమీటర్ల రోడ్లు, వంతెనలకు రూ.169.59 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉండగా, కొన్ని టెండర్‌ దశలోనే ఉన్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.307 కోట్లతో 2,097 పనులు మంజూరయ్యాయి. అందులో 1,569 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement