నకిలీ వెబ్‌సైట్లతో మోసాలు
అల్లిపురం: డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాన్ని దుర్వినియోగం చేసి, ప్రఖ్యాత హోటళ్ల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి సైబర్ ముఠాకు సహకరిస్తున్న ప్రధాన నిందితుడిని నగర సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రముఖ హోటళ్ల పేర్లతో నకిలీ డొమైన్‌లను తీసుకుని వెబ్‌సైట్లను సృష్టిస్తున్నాడు. అనంతరం ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. రూమ్ బుకింగ్ పేరుతో క్యూఆర్ కోడ్‌లు, వ్యక్తిగత మొబైల్ నంబర్లను ఇచ్చి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి, గూగుల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పోర్టల్ ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించారు. దీని ఆధారంగా నకిలీ వెబ్‌సైట్లను న్యూఢిల్లీలోని లక్ష్మీనగర్‌కు చెందిన యతేంద్ర జాదవ్ సృష్టిస్తున్నట్లు గుర్తించా రు. అతడిని పట్టుకునేందుకు సాంకేతిక నైపుణ్యం కలిగిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ నెల 16న నిందితుడిని పట్టుకుని ముందుగా స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై విశాఖకు తీసుకొచ్చి, జిల్లా కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. నిందితుడి వద్ద నుంచి యాపిల్ ఐఫోన్, యాపిల్ మ్యాక్‌బుక్, ఇతర ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


