‘హోంమంత్రివా? హెరిటేజ్‌కు మంత్రివా?’
మహారాణిపేట: ‘వంగలపూడి అనితక్కా.. నీవు రాష్ట్రానికి హోంమంత్రివా? లేక హెరిటేజ్ సంస్థకు మంత్రివా?‘ అని వైఎస్సార్ సీపీ మీడియా అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి నిలదీశారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హోంమంత్రి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా.. మైనర్ బాలికలపై అత్యాచారాలు, మహిళలపై దారుణాలు నిత్యకృత్యమవుతున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కానీ, హెరిటేజ్ సంస్థ విషయం వచ్చేసరికి మాత్రం ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ సంస్థకు సీఈవోలు, డైరెక్టర్లు ఉంటారు కదా.. మీకెందుకు అంత తాపత్రయం? అని ప్రశ్నించారు.
సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోండి
మీ నాయకులు చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు వింటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం హోంమంత్రి హోదాలో ఉన్న మీకు తగదని నాగ మల్లేశ్వరి హితవు పలికారు. ‘మీ సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ఒక మాజీ ముఖ్యమంత్రిని కనీస గౌరవం లేకుండా సంబోధించడం మీ అహంకారానికి నిదర్శనం. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు‘ అని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మల్లేశ్వరి విమర్శించారు. గత 19 నెలల్లో మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, పెట్రోల్ బాంబుల సంస్కృతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. ‘అసెంబ్లీలో శాంతిభద్రతలు బాగున్నాయని, గంజాయి లేని రాష్ట్రమని కాకి లెక్కలు చెబుతున్నారు తప్ప.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ఎన్ని స్పెషల్ టీమ్‌లు వేశారు? ఎన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు? ఎంతమంది నిందితులకు శిక్ష పడేలా చేశారు?‘ అని ఆమె ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ ప్రతీకార చర్యలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరిస్తున్నంత కాలం వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


