రూ.25 కోట్ల రిటైల్ రుణాల అందజేత
రిటైల్ రుణాల చెక్కు అందజేస్తున్న బ్యాంకు రీజినల్ హెడ్ ఎ.వి.ఆర్.మూర్తి
సీతంపేట: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో శనివారం అక్కయ్యపాలెంలోని ఒక ఫంక్షన్ హాల్లో రిటైల్ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రిటైల్, ప్రముఖ కస్టమర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హత సాధించిన కస్టమర్లకు బ్యాంకు రీజినల్ హెడ్ ఎ.వి.ఆర్.మూర్తి చేతుల మీదుగా రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా మొత్తం రూ.25 కోట్ల విలువైన రిటైల్ రుణాలు మంజూరు చేశారు. కార్యక్రమానికి గరుడ కన్‌స్ట్రక్షన్ నుంచి పి.నర్సరాజు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. బ్యాంకు అధికారులు తమ రిటైల్ రుణ పథకాలైన సెంట్ హోమ్‌లోన్, సెంట్ గృహలక్ష్మి హోమ్‌లోన్, సెంట్ వెహికిల్ లోన్, సెంట్ ఎడ్యుకేషన్ లోన్, సెంట్ మార్టిగేజ్ లోన్, సెంట్ పర్సనల్ గోల్డ్ లోన్ తదితర పథకాలపై పీపీటీ ప్రజంటేషన్ ద్వారా కస్టమర్లకు అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత విస్తరించడంపై నిరంతర కృషి చేస్తున్నట్లు తెలిపారు.


