ఇంటింటికీ రేషన్‌ అద్భుతం.. కేంద్ర బృందాల కితాబు

Central Officials Appreciates House To House Ration Card Scheme In AP - Sakshi

వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కీలకం

కాకినాడ సిటీ/కర్నూలు (సెంట్రల్‌): రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటికీ రేషన్‌ పంపిణీ విధానాన్ని జైపూర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ స్టడీస్‌ (సీడీఈసీఎస్‌) బృందాలు ప్రశంసించాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం–2013 అమలు తీరు సమగ్ర పరిశీలన, మదింపునకు కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ జైపూర్‌లోని సీడీఈసీఎస్‌ను థర్డ్‌పార్టీ మానిటరింగ్‌ సంస్థగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ బృందాలు తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో రేషన్‌ పంపిణీ విధానాన్ని పరిశీలించి సోమవారం కలెక్టర్‌ కార్యాలయాల్లో అధికారులతో సమావేశమయ్యారు.

కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ఈ బృందం సభ్యులు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సీనియర్‌ కన్సల్టెంట్‌ కె.గిరిజాశంకర్, సీడీఈసీఎస్‌ టీమ్‌ లీడర్‌ రవిపారీక్‌ తదితరులు ఇన్‌చార్జి కలెక్టర్‌ జి లక్ష్మీశ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మతో సమావేశమయ్యారు. ఆది, సోమవారాల్లో కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు అర్బన్‌ పరిధిలోని మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు, చౌకధరల దుకాణాలను పరిశీలించినట్లు తెలిపారు. రేషన్‌కార్డుదారులతో మాట్లాడి సరుకులు అందుతున్న తీరును తెలుసుకున్నట్లు చెప్పారు.  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తకార్డుల జారీ, పేర్ల చేర్పు, తొలగింపు తదితర సేవలు 21 రోజుల్లోపు ప్రజలకు అందుతున్నాయన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సగటున ఈ సమయం 45 రోజులుగా ఉందని తెలిపారు.

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌యోజన (పీఎంజీకేవై), రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నట్లు చెప్పారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు అందిస్తుండటం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉందన్నారు. రాష్ట్ర పీడీఎస్‌ కార్డుదారులకు సార్టెక్స్‌ బియ్యం అందిస్తుండడంపై కార్డుదారులు అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పటిష్ట, ప్రణాళికాయుత వ్యవస్థ ద్వారా జిల్లాలో 16.50 లక్షల రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెలా ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు అందుతున్నాయని, ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుత పనితీరుకు గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ వెళ్లి రేషన్‌ ఇవ్వడం ప్రశంసనీయమని సీడీఈసీఎస్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ఉపేంద్ర కె.సింగ్‌ పేర్కొన్నారు.

కర్నూలు కలెక్టరేట్‌లో  ఆయన జేసీ (రెవెన్యూ) ఎస్‌.రామసుందర్‌రెడ్డి, డీఎస్‌వో మోహన్‌బాబుతో సమావేశమయ్యారు. ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, నంద్యాల మండలాల్లో స్వయంగా రేషన్‌ షాపులను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడినట్లు చెప్పారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను ఇస్తున్నట్లు వినియోగదారులు చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరుకులు అందించే విధానం బాగుందని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 760 మినీ ట్రక్కులను ఏర్పాటు చేసినట్లు జేసీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో సీడీఈసీఎస్‌ అధికారులు అలీబాషా, రామారావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top