అభివృద్ధిలో ఏపీకి అండగా కేంద్రం

Central Govt Support to Andhra Pradesh Development - Sakshi

జన ఆశీర్వాద సభలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 

తిరుపతి గాంధీరోడ్డు/రేణిగుంట: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌– 370ని రద్దు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో బుధవారం నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ కూడలిలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. కోవిడ్‌ సమయంలో పేదలకు ఉచితంగా నెలకు 5 కిలోల బియ్యం అందించామని గుర్తుచేశారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు పలు కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. ప్రపంచం మొత్తం కోవిడ్‌తో బాధపడుతున్నా భారత్‌లో మోదీ ప్రభుత్వం సమర్థంగా వైరస్‌ను ఎదుర్కొని అతిపెద్ద వ్యాక్సినేషన్‌ మిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను కూడా అధిగమించామని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉన్న గండికోటను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కిషన్‌రెడ్డికి సాదర స్వాగతం  
రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సాదర స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి పుష్పగుచ్ఛం, శాలువా అందించి ఆయనకు స్వాగతం పలికారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top