బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట 

Central Govt reply to YSRCP MP Vijayasai Reddy question - Sakshi

వైఎస్సార్‌సీపీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో ప్రైవేటు సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్రం.. అందులో అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటోందని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

దీనికి జితేంద్ర సింగ్‌ స్పందిస్తూ.. గత ఏడెనిమిదేళ్లలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా తీసుకుంటున్న చర్యల్లో పురోగతి కనిపిస్తుందన్నారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు.   

రిమోట్‌ ఓటింగ్‌పై పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ
రిమోట్‌ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు వెల్లడించారు. ఫిబ్రవరి 28లోపు తమ అభిప్రాయాలను పంపాలని ఆయా పార్టీలకు సూచించామన్నారు. ఓటింగ్‌ ప్రక్రియలో వలస కార్మికుల భాగస్వామ్యం పెంచేందుకు ఈసీ గతేడాది డిసెంబర్‌ 28న ఒక నోట్‌ను అన్ని రాజకీయ పార్టీలకు పంపిందన్నారు.

ఈ మేరకు విజయసాయిరెడ్డి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘వలస ఓటరును ఏ విధంగా నిర్వచించాలి, వారిని ఏ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించాలి, రిమోట్‌ ఓటింగ్‌ విధానం, వారి ఓట్ల లెక్కింపు, వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఏ విధంగా వర్తింప చేయాలి? వంటి అంశాలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలను కోరాం’’ అని తెలిపారు.  

ఏపీ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్‌
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 2,41,465 కేసులు, తెలంగాణ హైకోర్టులో 2,53,358 పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. అంతేకాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు.

సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదే సమయంలో దేశంలో అన్ని హైకోర్టుల్లో మొత్తం 59,87,477 కేసులు పెండింగ్‌ ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top