ఏపీఈఆర్‌సీకి మరిన్ని అధికారాలు.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Central Govt Has Extended More Powers To APERC - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అధికారాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రైవేటు డిస్కంలకు మార్గం సుగమం చేస్తూ మరో గెజిట్‌ ఇచ్చింది. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం విద్యుత్‌ చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదించింది. 

అయితే, ఆ బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో గెజిట్‌ రూపంలో వీటిని తెచ్చింది. విద్యుత్‌ చట్టం–2003లోని సెక్షన్‌ 176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ నియమావళిని సవరించింది. ఈ నెల 21 నుంచే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు గల ఏపీఈఆర్‌సీకి ప్రస్తుతం విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏడాదికోసారి ఆదాయ, వ్యయాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లను సమర్పిస్తున్నాయి. ఆ నివేదికలపై బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మరుసటి ఏడాది విద్యుత్‌ చార్జీల (టారిఫ్‌) పెంపును మండలి నిర్ణయిస్తుంటుంది. డిస్కంలు మధ్యంతరంగా సమర్పించే ఇంధన సర్దుబాటు (ట్రూ అప్‌) చార్జీలపై అవసరానికి అనుగుణంగా అనుమతులు జారీ చేస్తుంటుంది. విద్యుత్‌ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంటుంది. 

కేంద్రం ఇచ్చిన తాజా గెజిట్‌ ప్రకారం విద్యుత్‌ కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆదాయ వ్యయాలు, రాయితీల గణాంకాలు వంటి నివేదికలను ప్రతి డిస్కం మూడు నెలలకోసారి ఏపీఈఆర్‌సీకి సమర్పించాలి. వీటిని విద్యుత్‌ నియంత్రణ మండలి క్షుణ్ణంగా పరిశీలించి,  నిర్ధారించుకున్న తరువాత నెల రోజుల్లోగా కేంద్రానికి పంపించాలి. అలాగే ఇప్పుడు చేస్తున్నట్లుగానే విద్యుత్‌ చార్జీల సవరణ ఆదేశాలు కూడా సకాలంలోనే చేయాలి. ఇందుకోసం డిస్కంలు సమరి్పంచే లెక్కలు వాస్తవమో కాదో తేల్చాల్సిన బాధ్యత మండలిపై ఉంటుంది. దీంతో ఏపీఈఆర్‌సీ మరింత అప్రమత్తంగా, కఠినంగానూ వ్యవహరించాల్సి ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top