రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే

Central Government Statement in Rajya Sabha On Andhra Pradesh Capital - Sakshi

ప్రస్తుతానికి అమరావతే 

సయోధ్యతోనే విభజన సమస్యల పరిష్కారం

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన 

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కేంద్రం పునరుద్ఘాటించింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు విభజనకు సంబంధించిన అంశాలపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యుత్తు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బకాయి బిల్లుల డబ్బులను ఇంతవరకు చెల్లించకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వడ్డీతో కలిపి సుమారు రూ.6 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సి ఉందన్నారు. కేటాయింపుల్లో తెలంగాణకు ఆ మేరకు తగ్గించి ఏపీకి ఇవ్వాలని ఎంపీ టీజీ వెంకటేశ్‌ కేంద్రాన్ని కోరారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి, సాగునీరు నిమిత్తం తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుంటోందని, తదుపరి కేటాయింపుల్లో ఆ మేరకు వాటా తగ్గించాలన్నారు. తాజా పరిస్థితులను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నిత్యానందరాయ్‌ తెలిపారు.

నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే..
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌గా కేంద్రం పలుచోట్ల ప్రస్తావిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిదని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ కేంద్రానికి తెలిపిందని నిత్యానందరాయ్‌ చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్నం, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును విరమించుకున్నట్లు తెలిíసిందన్నారు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని చెప్పారు. అయితే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయమని పునరుద్ఘాటించారు.   

రాష్ట్రంపై విభజన దుష్ప్రభావం
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన వేగవంతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. విభజన చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లు అని తెలిపారు. చట్ట ప్రకారం ఆస్తుల విభజన ఇప్పటివరకు జరగకపోవడం వల్ల ఆ దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడుతోందన్నారు. 

పరస్పర అంగీకారంతోనే పరిష్కారం..
ఆస్తుల విభజనకు కేంద్రం నియమించిన కమిటీ 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని సిఫార్సు చేసిందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top