జగన్‌ ప్రభుత్వంలోనే ఎయిడెడ్‌కు జీవం 

CAG Report on Aided Educational Institutions development with CM YS Jagan Govt - Sakshi

కాగ్‌ నివేదికలో వెల్లడైన వాస్తవం

ఆ సంస్థలకు 2019–20లో రూ.10,048 కోట్ల గ్రాంటు

సాక్షి, అమరావతి: ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు పూర్వవైభవం తీసుకొచ్చే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో మరోసారి తేటతెల్లమైంది. అలాగే పట్టణ, గ్రామీణ సంస్థలు, సహకార సంస్థలకు ఆర్థిక సాయం, విద్యుత్‌ రాయితీల విషయంలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే అత్యధిక మేలు జరిగింది. అన్ని రకాల ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ. 9,600 కోట్లు గ్రాంటుగా ఇవ్వగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో రూ. 10,048 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు కాగ్‌ పేర్కొంది.

అధికారంలో ఉండగా ఖాళీల భర్తీలు చేపట్టకుండా, సరైన పర్యవేక్షణ చేయకుండా ఎయిడెడ్‌ సంస్థలను కునారిల్లేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తుంటే బురద జల్లుతుండడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఒక్క అమ్మ ఒడి పథకం కోసం 2019–20 ఆర్థిక ఏడాదిలోనే రూ. 6,349.47 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్‌ వెల్లడించింది. ఇక విద్యుత్‌ రాయితీలను చంద్రబాబు ప్రభుత్వం భారీగా కుదించేసినట్లు నివేదికలో తేలింది. సీఎం జగన్‌ వచ్చిన తర్వాత విద్యుత్‌ రాయితీల కోసం ఏకంగా నాలుగున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. 2019–20లో వైఎస్సార్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ కోసమే రూ. 4,919.84 కోట్లను వ్యయం చేసినట్లు కాగ్‌ పేర్కొంది. ఇక సహకార సంస్థలకు గత ప్రభుత్వం కేవలం రూ. 543 కోట్లు కేటాయించి పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ. 9,487 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు వెల్లడైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top