సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే... చంద్రబాబు పుట్టారు తప్ప... ఆయన వ్యవస్థలను పుట్టించలేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వానికి వ్యవస్ధలన్నా, చట్టాలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? తాలిబన్ ప్రభుత్వమా? అని నిలదీశారు.
పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిది అక్రమ అరెస్టే అని తేల్చి చెప్పిన బొత్స... పార్టీ అభిప్రాయాన్ని చెబితే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. బహుశా ప్రభుత్వ ఒత్తిడితోనే సతీష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్నదే తన అభిప్రాయమని... అలా చెబితే నన్ను కూడా అరెస్టు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. మా గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసహనంతో ఊగిపోతున్న సీఎం... ప్లాంట్ రక్షణ కోసం శాశ్వత పరిష్కారం చూపకుండా ఎదురుదాడి చేయడమేంటని నిలదీశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో కరువైన రాజ్యాంగబద్ద పాలన...
రాష్ట్రంలో రాజ్యంగబద్దమైన పాలన సాగడం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చట్టాలు, రాజ్యాంగంతో మాకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చట్టాలను చేతిలోకి తీసుకుని... రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇలాంటి ఘటనలో కొకొల్లలు. నిన్న ఉదయం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిని అనంతరపురం పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి కనీస సమాచారం, ఎలాంటి పేపర్లు లేకుండా అరెస్టు చేసి.. రాత్రికి గౌరవ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల వ్యవరహరించిన తీరును తప్పుపట్టిన న్యాయమూర్తి చీవాట్లు పెడితే అప్పుడు వెంకటరెడ్డిని విడుదల చేశారు.
ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాన్ని చెబితే అరెస్టులా?
వెంకటరెడ్డి మాటల్లో ఏం తప్పుంది? టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీగా సతీష్ కుమార్ మృతిపై మా అభిప్రాయాలను పార్టీ అధికార ప్రతినిధిగా వెంకటరెడ్డి మాట్లాడితే ఆయన్ను అరెస్టు చేస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వమే సతీష్ కుమార్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటుంది. ఆయన్ను ఎవరైనా హత్య చేశారా? లేక ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది ప్రభుత్వమే తేల్చాలి. హత్య జరిగితే ప్రభుత్వం నిందితులను పట్టుకుని శిక్షించండి. ఎవరు అభ్యంతరం చెప్పారు ? ప్రభుత్వం సతీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చిందని మా పార్టీ అభిప్రాయాన్నిచెబితే .. అరెస్టు చేస్తారా? బహశా ప్రభుత్వ పెద్దలు, పోలీసుల ఒత్తిడి చేయడం వల్లే అది తట్టుకోలేక సతీష్ కుమార్ చనిపోయి ఉండవచ్చు. నేను కూడా అదే విషయాన్ని చెబుతున్నాను. నన్ను అరెస్టు చేయండి?
ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే అన్నీ మీకు అనుకూలంగా చేయాలా? అది నడవదు. బాధ్యతాయుతమై రాజకీయ పార్టీగా వైయస్.జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నిస్సంకోచంగా మా అభిప్రాయాన్ని వెల్లడిస్తాం. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే రోజులన్నీ ఒకేలా ఉండవని అధికార పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నాం. హత్య అని అధికార పార్టీ నాయకులే అన్నప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఏం చేస్తోంది?. వాళ్లమీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఇది చేతకాని ప్రభుత్వమా? నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేసి.. తప్పు చేసిన వాళ్లను శిక్షించండి. ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
స్టీల్ ప్లాంట్ పై సీఎం అసహనం ఆశ్చర్యకరం...
మరోవైపు విశాఖలో సీఎం చంద్రబాబును స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పాత్రికేయులు ప్రశ్నిస్తే.. ఆయన అంత అసహనానికి గురికావడం ఆశ్చర్యకరం. మీ చర్యలు, వ్యవహారశైలిపై అనుమానం ఉండబట్టే మిమ్నల్ని ప్రశ్నిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.11,400 కోట్లు నిధులు విడుదల చేసినందుకూ అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. బాధ్యత ప్రతిపక్షంగా కేంద్రం సాయానికి అభినందనలు తెలుపుతాం కానీ.. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయమని కూడా తీర్మానం చేయాలని పట్టుబడ్డాం. కానీ దానికి ఎందుకు ప్రభుత్వం అంగీకరించలేదు? గతంలో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ .జగన్ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వస్తే .. వేదిక మీదే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దు, విశాఖ ఉక్కు ప్రజాపోరాటం, త్యాగాల ఫలితం అని వైయస్.జగన్ ప్రధానిక సమక్షంలోనే చెప్పారు. దయచేసి ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోవాలని కోరాం. కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ మాట చెప్పలేక పోతుంది.
ఇది ప్రజా ప్రభుత్వమా ? తాలిబన్ రాజ్యమా ?
మేము స్టీల్ ప్లాంట్ కు రూ.11 వేలు కోట్లు ఇచ్చాం, డెత్ రిలీఫ్ కు పనికి వస్తుందని డొంకతిరుగుడు సమాధానం చెబుతున్నారు తప్ప.. ప్రజలు, కార్మికులకున్న సందేహాలను నివృత్తి చేయడం లేదు. అప్పులు తీర్చి ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారన్న వారి ఆందోళనను ఎందుకు నివృత్తి చేయడం లేదు? నాలుగు నెలల క్రితం వైయస్సార్సీపీ ఎంపీలు లోక్ సభలో ప్రశ్నిస్తే... ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్న డిజ్ ఇన్వెస్ట్ మెంట్ నుంచి వెనక్కి వెళ్లేది లేదని కేంద్రమంత్రే సమాధానం చెప్పారు. దాన్ని ఆసరగా పాత్రికేయులు ప్రశ్నిస్తే... వారిని బెదిరిస్తారా?
ఇది ప్రజాస్వామ్యమా? అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న ప్రజా ప్రభుత్వమా ? లేక తాలిబాన్ ప్రభుత్వమా? ఇది చాలా శోచనీయం. సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ మీద స్పష్టతనివ్వకుండా సహనం కోల్పోవడాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. చంద్రబాబు పుట్టిన తర్వాత వ్యవస్థలు రాలేదని.. వ్యవస్థలు వచ్చిన తర్వాత మనందరం వచ్చామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చట్టాన్ని చేతిలోకి తీసుకుని.. పోలీస్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీకోసమే ఉన్నట్టు.. ప్రజల కోసం కాదన్నట్టు వ్యవహరిస్తున్న తీరు సరికాదని హెచ్చరించారు.
అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...
గత 15 ఏళ్లుగా కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్రం ఆధీనంలో ఉందా? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందా? ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ పరిశ్రమకు కావాల్సన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అసలు నష్టాలకు కారణం ఏంటో కనుక్కోవాలి. నవరత్నాల్లో ఒకటిగా నిల్చిన స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వెళ్లింది. ముడిసరుకు ఖరీదు పెరిగిపోయింది. క్యాప్టివ్ మైన్స్ ఉన్న ప్లాంట్లు కన్నా... ముడిసరుకు ఖరీదు పెరిగిపోవడంతో
అది ప్రొడక్షన్ కాస్ట్ మీద ప్రభావం చూపిస్తుంది.
కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం గతంలో రామెటీరియల్ కాస్ట్ 54 శాతం ఉంటే ఇప్పుడు అది 64 శాతం అయింది. దానికి క్యాప్టివ్ మైన్ లేకపోవడమే కారణం. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ అడిగితే పైపులైన్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. వైజాగ్ స్టీల్ కు కూడా క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ప్లాంట్ వయబులిటీకి వస్తుందని రాష్ట్రంలో ఉన్న మేధావులు, కార్మికులు, ప్రజలు అడుగుతున్నారు. అది చేయాల్సింది పోయి... సీఎం చంద్రబాబు ఎదురుదాడిగి దిగడం సరైనది కాదు.
గాయం ఉన్నచోట మందు పూయాల్సింది పోయి... అది పక్కనపెట్టి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారానికి శాశ్వతంగా నివారణ చర్యలు తీసుకోవాలన్నదే ప్రధాన డిమాండ్. దాని గురించి మాట్లాడకుండా.... ఎదురు దాడికి దిగడం సమంజసం కాదు.
సతీష్ కుమార్ మృతి వెనుక వైయస్సార్సీపీ నేతలున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ... ప్రభుత్వంలో ఉన్నవారు ఆరోపణలు చేసే అవకాశం లేదు. చేతకానప్పుడు, బురద జల్లాలనుకుంటేనే ఆరోపణలు చేస్తారు. లేదంటే వాస్తవాలు చెబుతారు. వ్యవస్థలన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నవారు ఆపోహపడే అవకాశం ఉంది. ఆరోపణ చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు వాస్తవాలే చెప్పాలి. అందుకే మా పార్టీ నేత వెంకటరెడ్డి అక్రమ అరెస్టును ఖండించాం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ల చేతుల్లో వ్యవస్ధలుండవు. ప్రజల తరపున ప్రశ్నిస్తారు. ప్రజలకున్న సందేహాలను, వస్తున్న ఆరోపణలను అడుగుతారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బొత్స స్పష్టం చేశారు.


