బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు 

BJP Leader K Laxman In Social Consciousness Council - Sakshi

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ 

ఏలూరు (టూటౌన్‌): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించిన సామాజిక చైతన్యసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు.

దేశవ్యాప్తంగా గత పాలకుల విధానాల కారణంగా చేతివృత్తులు అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తర్వాత వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి సహకరించిన కేఈ కృష్ణమూర్తిని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పక్కనబెట్టారన్నారు. ఏపీలో బీసీలను అభివృద్ధి చేయడంలో, రాజకీయంగా ముందుంచడంలో బీజేపీ కృషిచేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్లకు రూ.10 వేలకోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. రూ.3 వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్లకే ఇస్తామన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆరుజిల్లాలకు చెందిన మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top