
సాక్షి, అమరావతి: సంక్షేమ, అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తాను చేస్తున్న కృషిలో విజయం సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి.
సర్దార్ పటేల్ సేవలు స్ఫూర్తిదాయకం
556 సంస్థానాలను స్వతంత్రంగా ఉంచడం ద్వారా భారతదేశాన్ని దెబ్బ తీయాలన్న బ్రిటిష్ పాలకుల కుట్రలను తిప్పికొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాచరిక రాజ్యాలను దేశంలో విలీనం చేశారని గవర్నర్ పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 146వ జయంతి వేడుకలను రాజ్‌భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి సర్దార్ పటేల్ నిరుపమాన సేవలు అందించారని కొనియాడారు. దేశానికి పటేల్ అందించిన సేవలు సదా స్ఫూర్తిదాయకమన్నారు.