
సాక్షి, తిరుపతి: హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడే మఠాలపై కూటమి సర్కార్ దాడి చేస్తోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలపై హిందూ సంస్థలు స్పందించాల్సి ఉందన్నారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విశిష్ట అద్వైత మఠం, శృంగేరి, పెజావర్ పీఠం, వైఖానస మఠం, అహోబిల మఠం, చినజీయర్ మఠం, మంత్రాలయం మఠం నెలకొల్పారు. హైందవ పరిరక్షణ కోసమే మఠాలు ఉన్నాయి. సంప్రదాయాలు, మఠాల నిర్వహణ సత్ సంకల్పంతో నిర్వహించాలని, శ్రీ మహావిష్ణువు వెలసిన దివ్య క్షేత్రంలో స్వామి వారి వైభవం విశ్వవ్యాప్తం చేయడానికి ఉన్నాయి. అటువంటి మఠాలకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పీఠాధిపతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. హైందవ మఠాలపై కూటమి దాడి సరికాదు.
కూటమి ప్రభుత్వం దాదాపు 32 మఠాలకు నోటీసులు జారీ చేసింది. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి?. పవిత్రమైన మఠాధిపతుల అధీనంలో ఉన్న మఠాలకు ఏవిధమైన నోటీసులు ఇచ్చారో చెప్పాలి. హైందవ మఠాలపై చేస్తున్న దాడి ఇది. హిందూ సంస్థలు వెంటనే స్పందించాల్సి ఉంది. ఇదంతా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోనే జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి మూల మూర్తి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టేలా ఉన్నారు. విద్వేష పూరితమైన ఆలోచన ఇది. మఠాధిపతులు మేల్కొవాలి. మఠాలపై దాడిని ఖండించాలి. సనాతన ధర్మం పట్ల గొడ్డలి వేటు ఇది. సనాతన ధర్మం కావడమే నా లక్ష్యం అంటున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.