శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహిస్తున్న భూమన కరుణాకరరెడ్డి దంపతులు
తిరుమల లడ్డూపై చంద్రబాబు ప్రభుత్వ అపచారానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం
భూమన నివాస ప్రాంతంలోమార్మోగిన వేదఘోష
భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భూమన దంపతులు
తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిందాపరిహార హోమాన్ని నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికతో స్పష్టమవడంతో ఇప్పటి వరకు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారంతో దెబ్బతిన్న శ్రీవారి పవిత్రతకు, ప్రతిష్టకు ప్రాయశ్చిత్తంగా తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భూమన దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి ప్రసాదంపై రాజకీయ నిందలా?
‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచపు అపనిందలు మోపారు. ఆ ఇద్దరూ కుమ్మకై దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్‌కళ్యాణ్ అయితే దుర్గా మాత గుడి మెట్లు కడిగి అత్యంత నీచంగా ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో విష ప్రచారానికి తెగబడ్డారు.
హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నిందలకు పరిహారంగా శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. దీనిద్వారా అపవాదులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం.
అయితే, లడ్డూ ప్రసాదంలో ఎక్కడా జంతు కొవ్వు కలవలేదని, ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని సీబీఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు చెంపపెట్టుగా మారింది. దీనిని వారు జీర్ణించుకోలేక అనుకూల పత్రికలు, ఛానళ్ల ద్వారా ఇంకా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించడం దారుణం’ అని భూమన అన్నారు.
సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు
ఇక తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పార్టీలు అడ్డంగా దొరికిపోయినప్పటికీ, టీడీపీకి చెందిన కొందరు ఇప్పటికీ ప్రసాదంపై విషప్రచారం చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూతో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేస్తూ, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టులు.. వివిధ ప్రాంతాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు పెడుతున్నారని వారు ఆరోపించారు.
హోమం భగ్నానికి యత్నం
శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమాన్ని ఎలాగైనా భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన గూండాలు ఒక్కసారిగా భూమన నివాసానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. హోమం సమీపంలో నానాయాగీ చేస్తూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్థానికులు, హోమానికి హాజరైన వేద పండితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ దుష్ప్రచారాలు ప్రజల్లో బట్టబయలవుతాయన్న భయంతో కూటమి నేతలు హోమాన్ని అడ్డుకునేందుకు రౌడీమూకలను దింపారని భూమన ఆరోపించారు.
టీడీపీకి చెందిన రాక్షస శక్తులు హోమం జరుగుతున్న తమ ఇంటిపై దాడికి ప్రయత్నించాయని, 100 మందికి పైగా రౌడీమూకలు అన్నమయ్య భవన్ సమీపంలో వీరంగం సృష్టించారని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి విష సంస్కృతిని తీసుకొచి్చంది కూటమి పార్టీల పెద్దలేనని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాన్ని రౌడీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన నేతలే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు.


